తిరుపతి.. లేదు పరపతి
టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదు గోడు వెళ్లబోసుకున్న తమ్ముళ్ల సమస్య ఇన్చార్జ్ మంత్రి నారాయణ దృష్టిక ఢిల్లీ నుంచి సీఎం వచ్చా మాట్లాడదామంటూ ఆయన దాటవేత‘అధికారులు మా మాట వినడంలేదు. చిన్నపని చెప్పినా చేయడంలేదు. ఇలాగే ఉంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా పనిచేసేది’ అంటూ తిరుపతి నగరంలోని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వెళ్లగక్కారు. అధికారుల తీరు మార్చాల్సిందేనంటూ సోమవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంట్లో ప్రత్యేకంగా సమావేశమై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆయన విషయాన్ని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. సీఎం ఢిల్లీలో ఉన్నారని.. ఆయన వచ్చాక మాట్లాడదామంటూ మంత్రి మాట దాట వేసినట్లు తెలిసింది.
తిరుపతి: తిరుమల కొండపైన గదుల వేలం విషయమై టీటీడీ ఈవో తమను లెక్క చేయలేదంటూ పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. చర్చల కోసం వెళ్లిన తమను లోపలి నుంచి బయటకు వెళ్లమని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేకు కూడా తగిన గౌరవం లభించలేదని సమావేశంలో పలువురు నేతలు వాపోయినట్లు తెలిసింది. నగరపాలక సంస్థలో రూ.5 లక్షల లోపు పనులను నామినేషన్పైన కేటాయించడంలేదంటూ కార్యకర్తలు పేర్కొన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జన్మభూమి కమిటీలను పటిష్టంచేసి కార్యకర్తలకు పనులు అప్పగించకపోతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని వాపోయినట్లు తెలిసింది. క్లబ్బులపై పోలీసుల దాడిని సైతం టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నట్లు తెలిసింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే బార్ల నిర్వహణ జరుగుతున్నా ఇబ్బడిముబ్బడిగా దాడులు చేయడం ఏమిటని కొందరు నేతలు వాపోయినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైతం తీవ్ర మనస్తాపం చెందినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తన భర్త ఈ పదవిని కానుకగా ఇచ్చినట్టుందని,నా మాట ఎవ్వరూ వినడం లేదని మంత్రి బొజ్జల, నారాయణతో పాటు పార్టీ అధ్యక్షుని ఎదుట వాపోయినట్లు దేశం వర్గాల్లో చర్చ సాగుతోంది.
ముక్కు సూటిగా వ్యవహరించడమే తప్పా?
తిరుమల కొండపై గదుల వేలం విషయంలో టీటీడీ ఈవో ముక్కుసూటిగా వ్యవహరించినట్టు సమాచారం. బాధితులెవ్వరికీ అన్యాయం జరగనివ్వననని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అయితే రాజకీయ నాయకుల ప్రయేయం లేకుండా బాధితులు ఎవరైనా ఉంటే తనను నేరుగా కలవాలంటూ.. ఈవో చెప్పిన విషయాన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నట్లు సమాచారం. ఏడు ఏళ్లుగా గదులు ఖాళీగా ఉన్నాయని, వేలం వేయకపోతే ఎలా అని ఈవో తమను కలిసిన నేతలను సైతం ప్రశ్నించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు ఉండి ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే విషయం తన దృష్టికి తేవాలని.. వెంటనే విచారించి వారికి న్యాయం చేస్తామని తెలిపినట్లు సమాచారం. రాజకీయ జోక్యాన్ని టీటీడీ ఈవో అంగీకరించక పోవడంపై నగరంలోని నేతలు కలత చెందినట్లు తెలిసింది. నగరపాలక కమిషనర్ సైతం రాత్రింబవళ్లు కష్టపడుతూ, స్మార్ట్ సిటీ పోటీకి అన్నీ సిద్ధం చేసుకుంటూనే, ఓ వైపు తుడా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ఆయన నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహారించడం పార్టీ నేతలకు మింగుడు పడనట్లు చర్చసాగుతోంది. అసాంఘిక కర్యకలాపాలపై ఎస్పీ దృష్టి సారించడాన్ని సైతం అధికార పార్టీనేతలకు ఇబ్బందికరంగా మారినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.