బగారా బైంగన్
షహర్కీ షాన్
సామ్రాజ్య విస్తరణ కాంక్షతో రగులుతున్న ఔరంగజేబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ సంస్థానానికి సైన్యాన్ని పంపాడు. పరిస్థితిని సమీక్షించేందుకు ఓ రోజు తెలంగాణ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడి కుతుబ్షాహీ పాలకుల ప్రతినిధులు చర్చకు వచ్చారు. ఇంతలో స్థానిక బావర్చీ వచ్చి ఏం వంట వండమంటారో పురమాయించాలని కోరాడు. ‘కిరీటం లేకుండా నేనుండలేను. వంటలోనూ కిరీటం ఉన్నదే కావాలి’ అంటూ ఆదేశించాడట. అంతే షాహీ దస్తర్ఖానాలో ఘుమఘుమలాడే బగారా బైంగన్ సిద్ధమైంది.
మన దేశంలో హైదరాబాద్, పాకిస్థాన్లో సింధ్ ప్రాంతం దీనికి ప్రసిద్ధి. హైదరాబాదీ బిర్యానీ సహజోడీగా ప్రపంచ ఖ్యాతి దీని సొంతం. పర్షియా నుంచి అరువు బిర్యన్ అనే వంటకాన్ని బిర్యానీగా మార్చి ప్రపంచానికి గొప్ప రుచిని అందించిన హైదరాబాదీ పాకయాజీలు బగారా బైంగన్ను దానికి జంటగా మార్చి ఆ రుచికి పరిపూర్ణత అందించారు. అప్పట్లో దీని రుచికి ముగ్ధుడైన
ఔరంగజేబు నాటి వంటవారికి విలువైన కానుకలు అందించారట.
ఆహా ఏమి రుచి..
తెలంగాణ లో జరిగే పెళ్లి విందులో హైదరాబాదీ బిర్యానీ ఉండితీరాల్సిందే.. దానికి సరిజోడిగా బగారా బైంగన్ కొలువుదీరాల్సిందే. కుతుబ్షాహీలకు పూర్వం నుంచి.. అంటే హైదరాబాద్ నగర నిర్మాణం కంటే ముందు నుంచే ఇక్కడ ఈ వంకాయ వంటకం స్థిరపడింది. ఆదిలో ఇది ముస్లిం కుటుంబాలకే పరిమితమైన ఈ వంటకం క్రమంగా అందరి నోళ్లలో కరిగిపోయింది.
పెళ్లి విందులో ఉండి తీరాల్సిందే...
పాత హైదరాబాద్ సంస్థానం పరిధిలో ప్రతి పెళ్లింట బిర్యానీతోకలిసి బగారా బైంగన్ కొలువుదీరటం అతి సాధారణ విషయం. ఉన్నత వంటకంగా సంబోధించటం ఆనవాయితీ. దీంతో పెళ్లిరోజున దాన్ని వడ్డించటాన్ని అతిథులకు గొప్ప మర్యాద చేయటంగా భావిస్తారు. కోస్తాలో బాగా ప్రాచుర్యంలో ఉండే గుత్తి వంకాయ కూరకు దగ్గరి పోలిక ఉండే బగారా బైంగన్లో మసాలా పాళ్లు కాస్త ఎక్కువ. కారం, పులుపుతో ఘాటుగా ఉండే గ్రేవీలో చిన్నగా ఉండే గుండ్రటి వంకాయలు నోరూరిస్తుంటాయి. నాలుగు పక్షాలుగా కోసిన వంకాయలను తొడిమె తొలగించకుండా నూనెలో బాగా వేయించి మసాలా మిశ్రమంలో మునిగేలా ఉంచుతారు. మసాలా చేరిన వంకాయ బిర్యానీతో కలిసి అద్భుత రుచిని నోటికందిస్తుంది.
- గౌరీభట్ల నరసింహమూర్తి