కూకూ బండి ... కోనసీమకు వస్తోందండీ
⇒ రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్ల కేటారుుంపు
⇒ తొలివిడతగా గౌతమీ నదిపై వంతెనకు టెండర్ల పిలుపు
⇒ దశలవారీగా వైనతేయ, వశిష్టలపై వంతెనల నిర్మాణానికి
⇒ నిధుల విడుదల అనంతరమే మొత్తం లైను నిర్మాణం
⇒ పదేళ్ల నాటికైనా పూర్తవుతుందన్న నమ్మకం
⇒ 2000లో దీని బడ్జెట్ రూ.645 కోట్లు, ఇప్పుడు రూ.2 వేల కోట్లు
అమలాపురం టౌన్ : కోనసీమలోని పచ్చని పొలాల మధ్యలోంచి...పంట కాల్వలు..ఏటి గట్లు దాటుకుంటూ...మూడు నదుల వంతెనలపై నుంచి రైలు బండి పరుగెడుతుంటే చూడాలన్న ఈ సీమ ప్రజల ఆశలు ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే మళ్లీ చిగురిస్తున్నాయి. ఆ ఆశ నెరవేరాలంటే కనీసం పదేళ్లు వేచి చూడాల్సిందే. ఈ రైలు తొలుత అమలాపురం వరకూ మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్ల కేటాయింపుతో దశాబ్దాల కల నెరవేరనుందన్న నమ్మకం ఈ ప్రాంతవాసుల్లో పెరిగింది. ఈ రైలు పరుగులు తీయూలంటే కోనసీమలో ముందుగా కోటిపల్లి - ముక్తేశ్వరం మధ్య గౌతమీ నదిపై వంతెన నిర్మించాలి. ఇందుకోసం టెండర్లు పిలవటంతో మార్గానికి సుగమమవుతోందని అంటున్నారు.
ఆది నుంచీ అడ్డంకులే...
గోదావరిపై నిర్మించాల్సిన మూడు వంతెనలే ఆది నుంచీ అడ్డంకిగా నిలిచాయి. లైన్ బడ్జెట్ ఒక ఎత్తయితే వంతెన బడ్జెట్ దానికి మించి భారమవుతోంది. ఈ క్రమంలో తొలుత కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య తొలి వంతెనకు టెండర్లు పిలవటంతో ఇక రైలు కోనసీమలో అడుగుపెట్టేందుకు సానుకూల సంకేతాలకు తెరలేచినట్టరుుంది. 2000 సంవత్సరంలో 54 కిలోమీటర్ల ఈ లైనుకు పునాది రాయి పడినప్పుడు ప్రాజెక్టు అంచనా కేవలం రూ.645 కోట్లు. ఇప్పుడు 16 ఏళ్ల జాప్యంతో ఆ వ్యయం దాదాపు రూ. రెండు వేల కోట్లకు చేరుకుంది.
దశల వారీ నిర్మాణమే అనివార్యం...
ఇంతటి భారీ వ్యయంతో ఉన్న ఈ లైను నిర్మాణానికి రైల్వే బడ్జెట్లో ఒకేసారి కాకుండా దశలవారీగా నిధులు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ లైను కోసం అయినవిల్లి మండలం తొత్తరమూడి నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకూ 185 ఎకరాలు ఇది వరకే సేకరించారు. కోటిపల్లి ఏటిగట్టు నుంచి ముక్తేశ్వరం ఏటిగట్టు వరకూ అంటే వంతెన నిర్మించే 3.55 కిలోమీటర్ల పొడవులో దాదాపు 84 ఎకరాల సేకరణ కూడా పూర్తయింది.
దీంతో రైలు అమలాపురం వరకూ వచ్చేందుకు మార్గం సుగమం అయినట్లే. కాకినాడ నుంచి రైళ్లు ఎలా నడుపుతున్నారో అలా అమలాపురం నుంచి కూడా కొన్నేళ్లు నడిపేంచే ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులు యోచిస్తున్నారు. తర్వాత దశల వారీగా వైనతేయ, ఆ తరువాతవశిష్ట నదులపై వంతెన నిర్మించటం ద్వారా కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైనుకు పూర్తి స్వరూపం వస్తుంది.
ఇదంతా సవ్యంగా జరిగితే పదేళ్లపైనే పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం రైల్వే లైను కోనసీమకు సాకారమైనప్పుడే పారిశ్రామిక కారిడార్లు, డ్రెజ్జింగ్ హార్బర్ వంటి అనూహ్య ప్రగతి సాధ్యమవుతుంది. తొలి వంతెన మాదిరిగా మిగతా రెండు వంతెనల నిర్మాణానికి వచ్చే ఏడాది టెండర్లు పిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.