ఆ నాలుగు దోషాలు లేనినాడే న్యాయం!
సిద్ధార్ధ గౌతముడు బుద్ధుడు కాకముందు ఐదువందల నలభై ఏడు జన్మలు ఎత్తినట్లు బౌద్ధగ్రంథాలు చెబుతున్నాయి. బుద్ధుని పూర్వజన్మలకు సంబంధించిన కథలే ఈ జాతక కథలు. మానవునిలో అనివార్యంగా ఉండాల్సిన ప్రేమ, కరుణ, సహనం, మైత్రీభావాల గురించి సూటిగా, స్పష్టంగా తెలియజేసే ఈ కథల నుంచి మచ్చుకు ఒకటి.
పూర్వం కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలించేవాడు. ఓరోజు రాజుగారు రథం మీద విహారానికి వెళ్లి వచ్చారు. సేవకులు ఆ గుర్రాలను విప్పారు. కానీ, రథానికీ, గుర్రాలకూ కట్టే తోలు పట్టెడలను విప్పి, భద్రం చేయకుండానే వెళ్లిపోయారు.
ఆ రాత్రి వాన పడింది. ఆ తోలు పట్టెడలు నాని, మెత్తబడ్డాయి. వాసన కొట్టాయి. ఆ వాసన పసిగట్టిన రాజుగారి పెంపుడు కుక్కలు వచ్చి, వాటిని కొరికి, తినేశాయి. తెల్లారి రాజుగారికి ఈ విషయం తెలిసింది. ‘‘ఎలా జరిగింది?’’ అని అడిగాడు.
ప్రభూ! మన కోటగోడ తలుపులు మూసే ఉన్నాయి. కానీ మురుగు నీరు పోయే తూములగుండా ఊరకుక్కలు వచ్చి ఈ పని చేసి ఉండవచ్చు’’అని భటులు చెప్పారు.
రాజుకు కోపం వచ్చింది. ‘‘కనిపించిన ఊరకుక్కలన్నింటినీ చంపేయండి’’ అని ఆజ్ఞ ఇచ్చాడు.
అంతే! భటులు కుక్కల వెంట పడ్డారు. చాలా కుక్కల్ని చంపేశారు. కొన్ని చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనై ప్రాణాలతో పారిపోయాయి. చావగా మిగిలిన కుక్కలన్నీ ఊరి చివరన ఉన్న శ్మశానం వద్దకు చేరాయి. అక్కడ వాటి రాజు ఉన్నాడు. అవి తమగోడు కుక్కల రాజుకు చెప్పుకున్నాయి. ‘‘మిమ్మల్నిలా చంపడానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు ఆ కుక్కలరాజు.
‘‘రాజా! రాత్రి కాశీరాజుగారి తోలు పట్టెళ్లను కుక్కలు తినేశాయట. మేమే ఆ పని చేశామని రాజుగారు మాకీ దండన విధించారు. కాని నిజానికి మాకే పాపం తెలియదు’’అన్నాయి.
ఆ కుక్కలరాజు వెంటనే కుక్కలన్నింటినీ తీసుకుని రాజాస్థానానికి బయల్దేరాడు. కోటద్వారం వద్దే కుక్కలన్నింటినీ ఉంచి, తానొక్కడే కోటలోకి ప్రవేశించాడు. రాజభటులు చూస్తుండగానే రాజుగారి పక్కనే ఉన్న న్యాయపీఠం కిందికి దూరి కూర్చున్నాడు. భటులు కర్రలతో ఆ కుక్కల రాజును కొట్టి చంపడానికి సిద్ధమయ్యారు.
సింహాసనం మీద కూర్చున్న రాజుగారు అది చూసి వారిని వారించి...
‘‘ఓ శునకమా! బైటకురా! ఎందుకు ఇలా వచ్చావు? ఎవరు నీవు?’’ అనడిగాడు. అప్పుడు కుక్కలరాజు బైటకు వచ్చి, సభ మధ్యలో నిలబడి-
‘‘రాజా! నేను కుక్కలకు రాజును. ఊరకుక్కల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చారట..?’’ అని అడిగాడు.
‘‘ఔను, నేనే!’’
‘‘ఎందుకలా ఇచ్చారు?’’
‘‘మా రథం పట్టెళ్లని ఊరకుక్కలే కొరికి తినేశాయి కాబట్టి... కుక్కలన్నింటినీ చంపమని ఆజ్ఞ ఇచ్చాను’’
‘‘మీ ఆజ్ఞ మీ రాజ్యంలోని కుక్కలన్నింటికా? కేవలం ఊరకుక్కలకేనా?’’అని ప్రశ్నించాడు కుక్కలరాజు.
‘‘అంటే..?’’
‘‘ఈ పని మీ పెంపుడు కుక్కలు ఎందుకు చేయకూడదు?’’
‘‘మా రాచకుక్కలా? అవి జాతికుక్కలు. ఇలాంటి పని అవి చేయవు. అసంభవం. ఇది ఊరకుక్కల పనే’’అన్నాడు రాజు.
‘‘నేరం నేను నిరూపిస్తాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వగలరా?’’ అని అడిగాడు కుక్కలరాజు. కాశీరాజు ఆశ్చర్యపడ్డాడు. సభలోని వారంతా నోరెళ్లబెట్టారు. ‘‘ఓ! తప్పక నిరూపించు’’అన్నాడు రాజు.
‘‘రాజా! ఓ గుప్పెడు దర్భమొలకల్ని తెప్పించి, వాటిని బాగా నూరి మజ్జిగలో కలిపి, మీ రాచకుక్కలకి తాగించండి’’ అన్నాడు.
రాజాజ్ఞ మేరకు ఆ కుక్కలన్నింటికీ దర్భ ఇగుళ్లు నూరి కలిపిన మజ్జిగ తాగించారు భటులు. ఆ మజ్జిగ తాగిన వెంటనే కుక్కలకు వాంతి అయ్యింది. అందులో తోలుముక్కలు కనిపించాయి.
రాజు సిగ్డుపడ్డాడు. కుక్కల రాజును అభినందించాడు. వెంటనే ఊరకుక్కలకు అభయం ఇచ్చాడు.
అప్పుడు కుక్కలరాజు కాశీరాజుతో... ‘‘రాజా! న్యాయాన్యాయాలు నిర్ణయించే వ్యక్తి తులాదండంలాగా ఉండాలి. ఒకరిపట్ల అయిష్టతతో మరొకరి పట్ల పక్షపాతంతో ఉండకూడదు. అలాగే నిర్లక్ష్యంగానూ వ్యవహరించకూడదు. నిజాన్ని నిరూపించడంలో భయపడకూడదు. ఈ నాలుగు దోషాలు లేనినాడే సరైన న్యాయం జరుగుతుంది’’అని చెప్పాడు కుక్కలరాజు.
నేరం ఒకరిది, శిక్ష మరొకరిది కాకూడదు. తమ వాళ్లమీద అతిప్రేమ, పని చేసే వాళ్లంటే లోకువ ఉండకూడదు అని బోధించే ఈ కథ ‘కుక్కుర జాతకం’ లోనిది.
శ్లోకం, భావం
ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణా శరీరం గృహం
పూజాతే విషయోపభోగ రచనా నిద్రా సమాధి స్థితిః
సంచారః పదయో ప్రదక్షిణ స్తోత్రాణి సర్వాదిరో
యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధానం
భావం: శంకరా! నా ఆత్మయే నీవు. నా బుద్ధియే పార్వతి. నా పంచప్రాణాలు, అయిదు ఉపవాయువులు నీకు సహచరులు. నా దేహమే నీకు ఆలయం. నేననుభవిస్తున్న భోగాలు, విషయ సౌఖ్యాలు, వాటికోసం నేను చేస్తున్న ప్రయత్నాలన్నీ నీకు పూజ. నేను నిద్రపోవటమే సమాధి. నిన్ను గురించిన ధ్యానమే నీకు నేను చేసే తపస్సు. నేను ఏ పనిమీద ఎక్కడికి వెళుతూనైనా వేసే ప్రతి అడుగూ నీ గుడి చుట్టూ ప్రదక్షిణం. నేను మాట్లాడే ప్రతి మాటా నిన్ను గురించిన స్తోత్రమే. ఇన్ని మాటలెందుకు? నా దైనందిన వ్యవహారంలో నేను ఏ పని చేసినా అదంతా నీ ఆరాధనమే అనుకో. ఆ విధంగా భావించు. నన్ను అనుగ్రహించు.
ఈశ్వరుని గురించి జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించిన శివమానస పూజాస్తోత్రంలోని శ్లోకాలివి. ఇందులో రెండు విశిష్ట భావాలున్నాయి. ధూపదీపాలతో కాకుండా మాసికంగానే శివార్చన చేయడం ఒకటి. శివోహం... అంటే నేనే శివ స్వరూపాన్ని అనే భావన రెండవది. జీవాత్మకూ, పరమాత్మకూ భేదం లేదు. నేను చేసే ప్రతిపనీ నాలో ఉన్న శివుడిని అర్చించడమే అని చెప్పడం అన్నమాట. ఎంత బాగుంది ఈ భావన!