ప్రధాని 'గే' వివాహం
లక్సెంబర్గ్: లక్సెంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బిటెల్ (42) 'గే' (స్వలింగ) వివాహాం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక నగరంలోని టౌన్ హాల్లో తన సహచరుడు, ఆర్కిటెక్ట్ అయిన గౌతియర్ డెస్టెనేను ఆయన సంప్రదాయబద్ధంగా పెళ్లాడారు. 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌లో స్వలింగ వివాహం చేసుకున్న తొలి ప్రధాని బిటెల్ కావటం విశేషం.
ఈ వివాహ వేడుకకు బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో పాటు సుమారు 500మంది అతిథులు హాజరయ్యారు. 2010లో ఐస్లాండ్ ప్రధాని జోహనా సిగుర్డార్డోటిర్ కూడా తన సహచరిణిని పెళ్లాడింది. ఆ తర్వాత ప్రపంచ దేశాధినేతల్లో స్వలింగ వివాహం చేసుకున్న రెండో నాయకుడు బిటెల్. 2013 డిసెంబర్లో జేవియర్ బిటెల్ లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందు నుంచే ఆయన గోతియర్తో సహజీవనం చేస్తున్నారు.