పెట్రో డీలర్లకు న్యాయం చేయాలి
-ఏపీఎఫ్పీటీ రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ
మంగళగిరి రూరల్(గుంటూరు జిల్లా)
రాష్ట్రవ్యాప్తంగా పెట్రోడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి తగు న్యాయం చేయాలని పెట్రోలియం ట్రేడర్స్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ (ఏపీఎఫ్పీటీ) రాష్ట్ర అధ్యక్షులు రావి గోపాలకృష్ణ అన్నారు. మంగళగిరికి సమీపంలోని హాయ్ల్యాండ్లోఆదివారం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెరుగుతున్న ఔట్లెట్లను తగ్గించడంతో పాటు ప్రస్తుతం వున్న ఔట్లెట్ల మనుగడను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పెట్రోడీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటే అపూర్వచంద్ర కమిటీ నివేదికను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో పెట్రో ధరలు లీటరుకు రెండు రూపాయిల నుంచి ఏడు రూపాయల వరకు తక్కువగా ఉండడంతో ఆంధ్ర రాష్ట్రంలోని డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, తద్వారా రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రో ధరల్లో ఒకే విధానం ఉండాలన్నారు.
పెట్రోలు డీలర్లు 24 గంటలు విధుల్లో ఉంటారని, రాత్రి వేళల్లో డీలర్లు, సిబ్బందిపై దాడులు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లడంతో పాటు ఒక్కోసారి ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గతంలో 125 డాలర్లు ఉండగా ప్రస్తుతం 30 డాలర్లకు పడిపోయిందని చెప్పారు.
పెట్రో ధరలు తగ్గించాలనేది తమ ప్రధాన డిమాండ్ అని, ఇందుకోసం ఏడాది నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవకపోవడం బాధాకరమన్నారు.ఈ సమావేశంలో బాపట్ల, పలాస ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గౌతు శ్యామ్సుందర్ తో పాటు.. వివిధ రాష్ట్రాలకు చెందిన 1500 మంది పెట్రో డీలర్లు పాల్గొన్నారు.