ఒబామా, హిల్లరీలపై జిందాల్ విమర్శలు
వాషింగ్టన్: స్వలింగ సంపర్కుల వివాహాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అభిప్రాయాలను భారత సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ విమర్శించారు. ఓపినియన్ పోల్స్ ఆధారంగా 'గే' పెళ్లిళ్లపై వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని ఎద్దేవా చేశారు. సుప్రీంకోర్టు మాదిరిగానే వారు కూడా ఓపినియన్ పోల్స్ చదివి తమ దృక్పథాన్ని వ్యక్త పరిచారని విమర్శించారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ అమెరికా సాధించిన విజయమని ఒబామా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మైలురాయి అని హిల్లరీ ప్రశంసించారు.
అయితే క్తైస్తవ మతాచారం ప్రకారం వివాహాలపై తనకు నిశ్చితాభిప్రాయం ఉందని జిందాల్ తెలిపారు. కోర్టు తీర్పు ఆధారంగా తన అభిప్రాయాన్ని మార్చుకోనని స్పష్టం చేశారు. పెళ్లి అనేది స్త్రీ, పురుషుడు మధ్య జరిగేది అని పేర్కొన్నారు. ఎన్ బీసీ న్యూస్ ఆదివారం నిర్వహించిన 'మీట్ ద ప్రెస్'లో జిందాల్ పాల్గొన్నారు. 44 ఏళ్ల రిపబ్లికన్ పార్టీ తరపు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు.