అక్రమార్కులకు అమాత్యుల అండ
♦ ఎంవీఐని రక్షించే యత్నం
♦ ఐదు రోజులు గడుస్తున్నా చర్యలు నిల్
♦ కేసులు నమోదుచేయని వైనం
ప్రభుత్వ శాఖల్లోని అక్రమార్కులకు కొందరు అమాత్యులు అండదండగా నిలుస్తున్నారు. ఎలాంటి పనులు చేసినా తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు లేకుండానే ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేసిన రవాణాశాఖ అధికారిపై చర్యలు తీసుకునే విషయంలో ఉన్నతస్థాయి వ్యక్తులు మీనమేషాలు లెక్కించడం విమర్శలకు దారితీస్తోంది. ఆ అధికారి ఓ మంత్రికి బంధువు కావడంతోనే చర్యలకు వెనుకాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నగరంపాలెం(గుంటూరు): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది. లేనటువంటి 27 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసిన అధికారిపై విచారణ చేపట్టి ప్రాథమిక నివేదిక కోసం జిల్లా అధికారిని ఉక్కిరిబిక్కిరి చేసిన ఉన్నతాధికారులు ప్రస్తుతం నీళ్లు నములుతున్నారు. నివేదిక అంది రెండు రోజులు దాటుతున్నా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కేవలం ఎంవీఐ వివరణతో సరిపెట్టి విషయానికి ముగింపు పలికే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. కనీసం కేసులు కూడా నమోదు చేయకపోవడంపై సందేహాలొస్తున్నాయి.
పూర్తిస్థాయిలో డీటీసీ విచారణ.....
మంగళగిరి ఎంవీఐ పరిధిలోని వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌పై జిల్లా ఉప రవాణా కమిషనరు జీసీ రాజారత్నం విచారణ చేపట్టారు. వాహనాలకు కేటాయించిన నెంబర్లు వెంటనే రద్దుచేసి డెలీవరీ చేయకుండా టీఆర్ నెంబరు కేటాయించిన విజయవాడకు చెందిన జాస్పర్ కంపెనీ వారిని, బాడీ బిల్డింగ్ చేసినట్లు బిల్లులు ఇచ్చిన కరుణామయ షెడ్డు వారిని 11వ తేదీ రాత్రి నుంచి 13 అర్ధరాత్రి వరకు విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంవీఐ వివరణతోపాటు, తన ప్రాథమిక విచారణ నివేదికను రవాణా శాఖ కమిషనరుకు డీటీసీ అందించారు. సంఘటన జరిగిన మరుసటిరోజే సంఘటనకు రవాణాశాఖలో పూర్తి బాధ్యుడు మంగళగిరి ఎంవీఐ అని విజయవాడలో సంయుక్త రవాణా కమిషనరు వెల్లడించారు. కానీ ఎంవీఐను శుక్రవారం వరకు సెలవులోకి పంపటం మినహా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ప్రకటనకే పరిమితం...ఉత్తర్వులేవీ....
ప్రభుత్వ కార్యాలయాలకు తప్పుడు పత్రాలు సమర్పించిన కారణంగా డీలరు, షెడ్డు, వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలని నిర్ణయించారు. రవాణా కార్యాలయం ఉన్న మంగళగిరి పరిధిలో చేయాలా, యజమానులు వ్యాపారం నిర్వహిస్తున్న విజయవాడ పరిధిలో నమోదు చేయాలా అన్న విషయం డీటీసీ రాజారత్నంకు శుక్రవారం రాత్రి వరకు ఆదేశాలు జారీ చేయలేదు. శుక్రవారం ఒంగోలుకు వచ్చిన రవాణా శాఖ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం ఎంవీఐ శివనాగేశ్వరరావును సస్పెండ్ చే స్తున్నట్లు ప్రకటించారు తప్ప, రాత్రి వరకు ఉత్తర్వులు మాత్రం జారీ చేయలేదు.