పంటల బీమాపై అవగాహన కల్పించాలి
ఆదిలాబాద్ అర్బన్ : జాతీయ వ్యవసాయ బీమా పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని అర్ధ గణాంక శాఖ డెప్యూటీ డెరైక్టర్(హైదరాబాద్) జి.దయానంద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వ్యవసాయ బీమా పథకంపై వ్యవసాయ శాఖ, అర్ధ గణాంకశాఖ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రకాల పంటలకు బీమా పథకం వర్తింపుపై శిక్షణ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో పత్తి, సోయాబీన్, మిర్చి, పసుపు పంటలకు బీమా వర్తిస్తుందని చెప్పారు.
సోయాబీన్ పంటకు బీమా వర్తిస్తుందని, దీనిపై ఈ ఏడాదిలో 589 యూనిట్లలో 2,542 పంట కోతల ప్రయోగాలు, వ్యవసాయ గణాంక శాఖ అధ్యయనం నిర్వహిస్తామని తెలిపారు. పంట కోతలను పర్యవేక్షిస్తూ దిగుబడిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ పంట కోతల ప్రయోగాలు సమగ్రంగా చేస్తే రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అధికారులు చేసే పంట కోతల ప్రయోగాల ద్వారానే రైతులకు బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. వివిధ రకాల పంటలపై నాణ్యతగా ప్రయోగాలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీవో షేక్మీరా, జేడీఏ రోజ్లీల, ఏడీ సత్యనారాయణ, ఎల్డీఎం శర్మ, అంజయ్య, వ్యవసాయ, గణాంక శాఖ అధికారులు పాల్గొన్నారు.