మిస్టరీ వీడిన జెమినీ విలేకరి హత్యకేసు
విశాఖ : విశాఖ జిల్లాలో గత నెల 26న హత్యకు గురైన జెమినీ విలేకరి జగదీశ్ హత్యకేసు చిక్కుముడి వీడింది. ఈ హత్యకేసులో శ్యాంమోహనరావును ప్రధాన నిందితుడుగా పీఎం పాలెం పోలీసులు గుర్తించారు. భార్యపై అనుమానంతోనే జగదీశ్‌ను హతమార్చినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. పోలీసుల కథనం ప్రకారం జార్ఖండ్ టాటానగర్‌కు చెందిన నిందితుడు శ్యాంమోహన్ రావు గత ఏడాదిగా ఉపాధి నిమిత్తం విశాఖ వచ్చి, తన భార్యతో నివాసం ఉంటున్నాడు. పొరుగునే ఉన్న కెమెరామెన్ జగదీశ్‌తో పరిచయం ఏర్పడింది. అయితే శ్యామ్ భార్యతో జగదీశ్‌కు అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో అతను తిరిగి టాటానగర్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది మే 14న శ్యాం భార్య ఆత్మహత్య చేసుకుంది.
తన భార్య ఆత్మహత్యకు జగదీశ్ కారణమని కక్ష పెంచుకున్న శ్యాంమోహనరావు అతడిని హతమార్చేందుకు పథకం వేశాడు. బయటకు వెళదాం రమ్మని ఈ నెల 26న జగదీశ్‌ను సాగర్ నగర్ ఏరియా గుడ్లవానిపాలెం తీసుకు వెళ్లి కత్తితో పొడిచి పరారయ్యాడు. స్థానికులు గమనించి జగదీశ్‌ను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు గత నెల 27న మృతి చెందాడు.
అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయాన్ని వెలికి తీశారు. జార్ఖండ్ లో నిందితుడిని అరెస్ట్ చేసి ఈరోజు ఉదయం విశాఖలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం పోలీసులు శ్యాంను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి శ్యాంమోహనరావుకు రిమాండ్ విధించటంతో జైలుకు తరలించారు.