ఆశలపై నీళ్లు!
రామగుండంలో జెన్కో విద్యుత్ కేంద్రాల ఏర్పాటు లేనట్లేనా?
ప్రభుత్వ ప్రతిపాదనల్లో లేని రామగుండం
కొత్తగూడెం, మణుగూర్పైనే కేసీఆర్ దృష్టి
రెండింటితో ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం
రామగుండం : రామగుండం కేంద్రంగా జెన్కో విద్యుత్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కినట్లే అనిపిస్తోంది. ఇతర జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడంతో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లినట్లరుుంది. ఫలితంగా ఉద్యోగాలు, ఉపాధిపై నమ్మకం పెట్టుకున్న వారి ఎదురుచూపులకు ఫలితం దక్కకుండా పోయే ప్రమాదమేర్పడింది.
తెలంగాణలో విద్యుత్ కేంద్రాల స్థాపనకు రామగుండం ప్రాంతం అనువైనదిగా మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. సమీపంలోనే గోదావరి, బొగ్గుగని క్షేత్రాలు ఉండడంతోపాటు ఇప్పటికే ఎన్టీపీసీ, బీ థర్మల్ ప్రాజెక్టు ఉండడంతో ఇక్కడ కేంద్రాల విస్తరణకు అనుకూలమని భావించారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం సైతం రామగుండం ప్రాంతం అనుకూలమని ప్రకటించింది. జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎన్టీపీసీ, జెన్కో ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. దీంతో తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు ఆశించారు. ఎప్పుడెప్పుడు కేంద్రాల ఏర్పాటు ప్రకటిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల రాష్ట్ర బడ్జెట్లో జెన్కో ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని స్థాపించనున్నట్లు పేర్కొన్నప్పటికీ స్థలాన్ని ప్రకటించలేదు. దీంతో అందరూ రామగుండంగానే భావించారు.
తెరపైకి కొత్తగూడెం, మణుగూరు
రామగుండంలో జెన్కో విద్యుత్కేంద్రాల ఏర్పాటు ప్రకటిస్తారనుకున్న తరుణంలో కొత్తగూడెం, మణుగూరుల్లో జెన్కో ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ప్రకటించింది. జెన్కో ఆధ్వర్యంలో అంచెలంచెలుగా విస్తరిస్తున్న కొత్తగూడెం(కేటీపీఎస్)లో 800 మెగావాట్ల ఏడో దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అదే విధంగా మణుగూర్‌లో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటుగా నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,400 మెగావాట్ల పవర్ ప్లాంటుకు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థతో నిధుల సమీకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జెన్కోతో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ప్లాంట్ల స్థాపన జాబితాలో రామగుండానికి ఈ ఏడాది చోటు దక్కలేదని స్పష్టమవుతోంది.
దీంతో స్థానికులు నిరాశచెందుతున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్లాంట్ విస్తరణకు ఏర్పాట్లు జరుగుతున్నా యూష్పాండ్కు స్థలం కేటారుుంపులో ఆలస్యమవుతోంది. అరుుతే జెన్కో ఆధ్వర్యంలో ప్లాంట్లు ఏర్పాటైతే స్థానికులకే ఉపాధి లభించే అవకాశముంది. కాంట్రాక్టు పనులు కూడా స్థానికులకే దక్కుతారుు.
స్థలాభావమే కారణమా?
రామగుండం కేంద్రంగా నూతన విద్యుత్ కేంద్రాల స్థాపనకు స్థలాభావమే కారణమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీ-థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణకు మాత్రమే అనుకూలత ఉన్నప్పటికీ నూతన విద్యుత్ కేంద్రాల స్థాపనకు ప్రభుత్వ స్థలాలు ఏకమొత్తంగా లభ్యం కాకపోవడంతో ఇక్కడ జెన్కో విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు అడ్డంకులు ఎదురవుతున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం రామగుండంలో బ్రిటీష్ ఫిజికల్ లాబొరేటరీ (బీపీఎల్)కి చెందిన భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు అధికారులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సదరు కేసుకు సంబంధించిన ఫైలు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు చేరింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అనువైన స్థలాలను ఎంపిక చేస్తే తమకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
సీఎం దృష్టికి తీసుకెళ్లా..
రామగుండం కేంద్రంగా 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలని వారం రోజుల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించా. రెండు రోజుల క్రితమే వ్యక్తిగతంగా ఆయనతో సమావేశమై రామగుండం స్థితిగతులపై వివరించా. బీ-థర్మల్ స్థలంలోనే నూతన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉందంటూ పూర్తి స్థాయిలో నివేదికలు ఆయనకు చూపించా. భూమి, బొగ్గు, రాజీవ్ హైవే, రైల్వే ట్రాక్, పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు, యాష్‌పాండ్ ఏర్పాటుకు స్థలం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. రెండు యూనిట్లు సాధ్యం కాకపోతే మొదటి దశలో ఒక్క యూనిట్ ప్రారంభించి దశలవారీగా విస్తరించవచ్చు. బీపీఎల్ పంచాయితీ తెగితే వారికో, లేదా ఎన్టీపీసీకో వెళుతుంది. దాంతో జెన్కోకు సంబంధం ఉండదు.
- సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్యే