జీవన ప్రమాణాలను మెరుగుపర్చండి
రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ పద్మ
నెల్లూరు(పొగతోట): యానాదుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ పద్మ పేర్కొన్నారు. గోల్డెన్ జూబ్లీ హాల్లో బుధవారం నిర్వహించిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (యానాదులు) ఏడో గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో యానాదులకు జీవనోపా«ధులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి జిల్లాకు ఐటీడీఏ అధికారిని నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపుతామని తెలిపారు. గిరిజన కాలనీల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని, గిరిజనుల అభివృద్ధికి చేపడుతున్న నిర్మాణాల్లో నాణ్యత ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. యానాదుల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. సంక్షేమ పథకాలను యానాదులు సద్వినియోగం చేసుకునేలా ప్రతి జిల్లాలో వర్క్‌షాపులను నిర్వహించాలని కోరారు. గిరిజన మత్స్యకార సంఘాలకు పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. కార్పొరేట్‌కు దీటుగా గిరిజన వసతిగృహాల్లో సౌకర్యాలను కల్పించాలని సూచించారు.æవిద్యార్థులు మధ్యలో చదువులను నిలిపేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపాధి అవకాశాలు కల్పించాలి
పదో తరగతి చదివిన విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. అర్హులైన యానాదులకు ఏఏవై రేషన్‌కార్డులను మంజూరు చేసి సక్రమంగా రేషన్‌ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న యానాదుల గృహాల స్థానంలో నూతన ఇళ్లు నిర్మించేలా చర్యలు చేపడతామన్నారు. సబ్‌ప్లాన్ నిధులను సమర్థంగా వినియోగించాలని సూచించారు. గిరిజన యువత అభివృద్ధి చెందేలా ఆటోలు, మేకలు, తదితర యూనిట్లను మంజూరు చేయాలని ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో చర్చించి రుణాలను మంజూరు చేయించాలని తెలిపారు. యానాదుల కోసం ప్రత్యేక డ్రైవింగ్ స్కూల్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనంతరం కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడారు. యానాదుల గృహనిర్మాణాల విషయమై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. పదో తరగతి ఫెయిలైన విద్యార్థినులను గుర్తించి వారిని పాఠశాలలు, హాస్టళ్లలో చేర్పించి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యానాదుల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా జాయింట్ కలెక్టర్ అధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైల్వే కోడూరు ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాట్లాడుతూ.. గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో సమావేశాలను నిర్వహించాలని కోరారు. అనేక అంశాలపై తీర్మానాలు చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఐటీడీఏ పీఓ కమలకుమారి, సూపరింటెండెంట్ ఇంజినీర్ ప్రసాదరావు, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి, వ్యవసాయ, మత్స్య, పశుసంవర్థక శాఖల జేడీలు హేమమహేశ్వరరావు, సీతారామరాజు, శ్రీధర్‌బాబు, నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.