ఎన్నాళ్లీ అలసత్వం?
సీమాంతర ఉగ్రవాదం మరోసారి పడగ విసిరింది. మంగళవారం తెల్లవారుజామున మంచు ముసుగుకప్పిన చీకటి మాటున ఉగ్రవాదులు నగ్రోటా సైనిక స్థావరంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. సైనికాధికారుల నివాసాలుండే భవనంలో నక్కి స్త్రీలు, పిల్లలను బందీలను చేసి భారీ విధ్వంసాన్ని, మారణకాండను సృష్టిం చాలని ఉగ్రవాదుల పన్నాగం. మన భద్రతా బలగాలు చొరవతో చూపిన తెగువ, అధికారుల భార్యలు ధైర్యంగా ప్రదర్శించిన సమయస్ఫూర్తి వారి లక్ష్యాన్ని వమ్ము చేయగలిగాయి. అయితే ఇద్దరు మేజర్ స్థాయి అధికారులు సహా ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది. అదేసమయంలో జమ్మూకశ్మీర్లోనే సంబా జిల్లా రామ్‌గర్ సెక్టార్‌లోకి చొరబడాలని యత్నించిన ముగ్గురు పాక్ ఉగ్రవాదులను మన బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి.
జమ్మూకు 14 కిలోమీటర్ల దూరంలోని నగ్రోటా పట్టణం సమీపంలోని 16వ సైనిక విభాగం జమ్మూకశ్మీర్ లోని నాలుగు కమాండ్ కేంద్రాలలో ఒకటి. వెయ్యి మంది సైనికాధికారుల నివాసం కూడా అక్కడే. ఈ దురాగతానికి పాల్పడ్డ ఉగ్రవాద మూక ఏదో ఇంకా ఇదమి త్థంగా తెలియదు. కాని దాని చిరునామా దాయాది దేశమేనని చెప్పనక్కర్లేదు. పాక్ సైన్యం, గూఢచార సంస్థ (ఐఎస్ఐ) సహాయం లేనిదే అతి పెద్ద సైనిక స్థావరమైన నగ్రోటావైపు ఉగ్రవాదులు కన్నెత్తి చూడగలిగేవారు కారనేది స్పష్టమే. ఈ దాడి జరి గిన రోజునే పాకిస్తాన్ కొత్త ఆర్మీచీఫ్‌గా లెఫ్టినెంట్ ఖమర్ జనరల్ జావెద్ బజ్వా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సకాలంలో, సక్రమంగా ఒక ఆర్మీచీఫ్ పదవీ విరమణ చేయడం, మరొకరు ఆ బాధ్యతలు స్వీకరించడం సాఫీగా జరిగిపోవడం పాక్‌లో అరుదు.
సీనియారిటీ రీత్యా నాలుగో స్థానంలో ఉన్న బజ్వాకు ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం పగ్గాలు అప్పగించడం విశేషం. సంచలనాలకు, దుందు డుకుతనానికి తావివ్వని వృత్తి నిపుణుడైన సైనికాధికారిగా ఆయనకు పేరుంది. పాక్‌కు ప్రధాన శత్రువు భారత్ కాదని, మిలిటెంట్లేనని ఆయన గతంలో ప్రక టించారు కూడా. ఆయన తనకు అనుకూలుడైన వ్యక్తిని ఐఎస్ఐకి అధిపతిగా తేనున్నారని తెలుస్తోంది. బజ్వా పదవిలో కుదురుకుని, మద్దతును కూడగట్టుకోగ లిగితే, పౌర ప్రభుత్వం భారత్‌తో సంబంధాలలో మార్పును కోరుకుంటే పరిస్థితి మారవచ్చు. ఏది ఏమైనా ఆధీన రేఖ వెంబడి సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేయడానికి ప్రయత్నిస్తానని బజ్వా చేసిన ప్రకటన ఆహ్వానించదగినది.
అలా అని సరిహద్దుల నుంచి ఎదురవుతున్న పెను సవాలు పట్ల ఏమరుపాటు వహించవచ్చని కానే కాదు. భారీగా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు పోలీసు దుస్తుల్లో వచ్చి ఉదయం 5.30 సమయంలో నగ్రోటా దాడికి పాల్పడ్డారు. సరి హద్దులను దాటి 30 కిలో మీటర్ల దూరం చొచ్చుకు వచ్చి ఒక్క రోజులో చేసిన దాడి ఇది కానేకాదని నిపుణులు భావిస్తున్నారు. పథకం ప్రకారం ఇక్కడి వారి సహ కారంతో అందుకు సన్నాహాలు జరిగి ఉండాలని విశ్వసిస్తున్నారు. కనీసం వారం ముందుగానైనా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి ఉండాలని ప్రాథమిక విచారణ వల్ల తెలుస్తున్నదని రక్షణ మంత్రిత్వశాఖ ఉన్నతాధికారి తెలిపినట్టు ఒక వార్తా సంస్థ కథనం. సమీపంలోనే మకాం వేసి, స్థావరానికి సంబంధించిన సమాచారా న్నంతటినీ పక్కాగా సేకరించిన తర్వాతనే ఉగ్రవాదులు దాడికి దిగారని ఆయన అన్నారట. అదే నిజమైతే, సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో తీరుబడిగా సాగు తున్న సన్నాహాలను పసిగట్టలేని మన గూఢచార వ్యవస్థ ఘోర వైఫల్యానికి కారణమేమిటో కేంద్ర హోం మంత్రిత్వశాఖే సమాధానం చెప్పాలి.
జనవరిలో పఠాన్‌కోటలోని మన వైమానిక స్థావరంపైనా, సెప్టెంబర్‌లో ఉడీ స్థావరంపైనా జరిగిన ఉగ్రవాద దాడుల తదుపరి... సరిహద్దులలోని మన స్థావరాల రక్షణకు హామీని కల్పించేలా వాటిని ఆధునీకరిస్తామని, ఆధునిక సాంకేతికతను, ఆయుధ వ్యవస్థలను అందించి సరిహద్దు భద్రతా దళాలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీలు ఏమైనట్టు? పొగమంచు అడ్డుతెరగా నిలవగా ఉగ్రవాదుల ఉనికిని కని పెట్టడం కష్టమైందంటున్న మన భద్రతా సిబ్బందిని తప్పు పట్టలేం. అందుకు తగ్గ ఆధునిక సాంకేతిక సాధనాలు వారివద్ద లేవు. కానీ మన భద్రతా వ్యవస్థకు బాధ్యత వహిస్తున్న పెద్దలు ఉగ్రవాదులు పేట్రేగడానికి అలాంటి పరిస్థితులు అనువైనవని ఊహించలేనంతటి అమాయకులా? భద్రతా బలగాల ఆధునీకరణలో, రక్షణ కొను గోళ్లలో క్షమార్హంకాని జాప్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శించడం మన ప్రభుత్వాల న్నిటికీ అలవాటు. అందుకు నేటి ప్రభుత్వం అపవాదం కాకపోవడమే విషాదం.
ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత మన సైన్యం సెప్టెంబర్ 29న పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యిత దాడులు జరిపినప్పటి నుంచి పలుమార్లు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించారు. భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి వారిని నిలువరించాయి. అదేసమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లం ఘించి పాక్ సేనలు పదే పదే విచక్షణారహితంగా కాల్పులు సాగిస్తూ వాస్తవాధీన రేఖను అగ్ని గుండంగా మార్చాయి. సెప్టెంబర్ 29 తర్వాత ఇలా మన జవాన్లు 26 మంది బలైపోయారు. మన భద్రతా వ్యవస్థపై, సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలపై ప్రజలకున్న అచంచల విశ్వాసం సడలేలా చేయడమే ఉగ్రవాదుల లక్ష్యం. మన సైన్యంపైన, స్థావరాలపైన ఉగ్రవాదులు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నది అందుకే.
అయినా మన భద్రతా వ్యవస్థను, గూఢచార వ్యవస్థను పటిష్టం చేయ కపోవడం, స్థావరాలను ఆధునీకరించలేకపోవడం అంటే మన జవాన్లను, అధి కారులను ఉగ్రమూకల తుపాకులకు ఆహారంగా వేయడమే అవుతుందని ఇప్పటి కైనా గుర్తిస్తారా? లక్ష్యిత దాడుల వంటి తీవ్ర చర్యను ప్రభుత్వం చేపట్టిందంటేనే ప్రతి చర్యలను ముందుగానే ఊహించి, మన స్థావరాలను, సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చి ఉంటుంది అని అనుకున్నాం. అది మన అత్యాశేనని నగ్రోటా దాడి రుజువు చేసింది. అత్యాధునిక సైనిక సంపత్తితో తమకు అనువైన సమ యంలో, అనువైన చోట అంతుబట్టకుండా దాడులు సాగిస్తున్న ఉగ్రవాదుల ఆట కట్టించడానికి మన భద్రతా బలగాల బలిదానాలే సరిపోవని ప్రభుత్వం ఇకనైనా గుర్తిస్తుందని ఆశిద్దాం.