కాంపిటీటివ్ కౌన్సెలింగ్
పోటీపరీక్షల్లో జనరల్ ఎస్సే రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
- ఆర్.ప్రకాశ్, హైదరాబాద్.
సరైన సమాచారాన్ని పొందుపరిచేందుకు, సమకాలీన ఉదాహరణలతో విశ్లేషణాత్మకంగా రాసేందుకు అవకాశమున్న ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మంచి స్కోర్ సాధించేందుకు అవకాశముంటుంది.
చాలా ముఖ్య అంశమైతే తప్ప అండర్లైన్ చేయొద్దు. అవసరమైతే పేజీకి ఒక అండర్లైన్ ఉండేలా చూసుకోవాలి.
సందర్భానుసారం అవసరమైనంతలో కొటేషన్స్ ఉపయోగించొచ్చు. అంతేగానీ పొంతనలేని కొటేషన్స్ వల్ల లాభం మాట అటుంచి నష్టం ఎక్కువ జరుగుతుంది.
ఎస్సేను పేరాగ్రాఫ్లుగా విభజించుకొని రాయాలి. ఒక పేరాగ్రాఫ్ ఒకే అంశానికి సంబంధించినదై ఉండాలి. ఒక పేరాకు, తర్వాతి పేరాకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.ఎస్సేలో పాయింట్లు ఉండకూడదు.. టేబుల్ వేయకూడదు.. అనేవి అపోహలు మాత్రమే. సందర్భాన్నిబట్టి అవసరమైన చోట సమాచారాన్ని పాయింట్ల రూపంలో రాయొచ్చు. వెన్ డయాగ్రమ్ల వంటివీ వేయొచ్చు.
రాజ్యాంగ సూత్రాలకు, లౌకిక వాదానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉండకూడదు. మతం, కుల దూషణలకు పాల్పడకూడదు. వ్యక్తిగత విమర్శలకు తావివ్వకూడదు.ఎస్సే ముగింపు ఆశావహ దృక్పథంతో ఉండేలా చూసుకోవాలి. నిరాశ, నిస్పృహలను ప్రతిబింబించకూడదు. ఇచ్చే పరిష్కారాలు ఆచరణ సాధ్యంగా ఉండాలి. ప్రారంభ ఎత్తుగడకు, ముగింపునకు సంబంధం ఉండేలా చూసుకోవాలి.