పెద్ద తిరుపతికి దీటుగా
పేరుకు మాత్రం చిన్న తిరుపతి.. అభివృద్ధి విషయంలో పెద్ద తిరుపతికి దీటుగా పరుగులు పెడుతోంది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రతీతి పొందిన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతోపాటు అభివృద్ధి మంత్రం పఠిస్తోంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తుండడంతో వారి అవసరాలు తీర్చేందుకు కోట్లాది రూపాయలతో ఆధునిక సౌకర్యాలు కల్పించే దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో భక్తుల మనోభావాలు తెలుసుకునేందుకు ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మారారు. భక్తుల తాకిడి అధికంగా ఉండే శనివారం నాడు భక్తుల మధ్యకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈవో : మీది ఏవూరు. దర్శనం తొందరగా అయ్యిందా. మా సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది.
టి శ్రీనివాసరావు : మాది ఎర్రమిల్లిపాడు. రూ.50 టికెట్ కొని దర్శనానికి వెళ్లాం. మాకన్నా ఉచిత దర్శనం లైన్లో వాళ్లే తొందరగా వెళ్లొచ్చారు.
ఈవో : మీ పేరేమిటి.. దర్శనం ఎలా జరిగింది.
సీహెచ్ శివసాయి : బాగానే జరిగింది. పాదయాత్రగా వచ్చే భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చూడండి సార్.
ఈవో : ఇంకా ఏమైనా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందా.
సీహెచ్ శివసాయి : వృద్ధులకు, చంటి పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ఈవో : దర్శనం వద్ద మా సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు.
కె.రాజు : స్వామి వద్దకు వెళ్లేసరికి సిబ్బంది ముందుకు కదలాలంటూ తోసేస్తున్నారు. ఈ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టండి సార్.
అక్కడి నుండి ముందుకెళ్లిన ఈవోకు నవ దంపతులు కనిపించడంతో వారిని ఆపి మాట కలిపారు.
ఈవో : ఎక్కడి నుంచి వచ్చారు. లైన్లో ఎంతసేపు ఉన్నారు
బి.వెంకటేష్ : ‘మాది ఏలూరు సార్. ఇక్కడ సౌకర్యాలు బాగానే ఉన్నాయి. దర్శనం తొందరగానే అయ్యింది’ అని చెబుతుండగా క్యూలైన్లో ఉన్న అయ్యప్ప మాలధారులు ‘స్వామీ.. ఇటుై రండి’ అని పిలిచారు. ఈవో వెళ్లి ‘చెప్పండి. మీకేమైనా సమస్యలున్నాయా’ అని అడిగారు.
ఎం.శ్రీను : భిక్ష సమయంలో గోవింద మాలధారులను తొందరగా పంపుతున్నారు. అయ్యప్ప మాలధారులను కొంతసేపు నిలిపివేస్తున్నారు. మాకూ త్వరగా భిక్ష పెట్టేలా చర్యలు తీసుకోండి.
ఈవో : మీరు చెప్పండి. ఇక్కడ కల్పించాల్సిన సౌకర్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా.
కె.సత్యనారాయణ : మోకాళ్లపై నడిచి వస్తామని మెక్కుకునే వారికి ఇక్కడున్న కారు రాళ్లు గుచ్చుకోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారి సౌకర్యం కోసం కార్పెట్లు వేయిస్తే బాగుంటుంది.
ఈవో : ఏవండీ దర్శనం బాగా జరిగిందా. సౌకర్యాలు ఎలా ఉన్నాయి.
కె.అప్పలస్వామి, రమణ దంపతులు : అన్నీ బాగానే ఉన్నాయి. మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం. మొదటి ఆహ్వానం స్వామివారికి ఇవ్వాలని వచ్చాం. దర్శనం బాగానే జరిగింది.
ఈవో : ఉద్యోగుల ప్రవర్తన బాగుందా.
కె.సత్యనారాయణ : సిబ్బంది బాగానే పనిచేస్తున్నారు. భక్తులను మర్యాదగానే చూస్తున్నారు.
ఈవో : చెప్పండి.. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు.
కె వెంకటరమణ : కాకినాడ నుంచి
ఈవో : భీమడోలులో రైలు దిగి ఉంటారు. అక్కడి నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయా
కె.వెంకటరమణ : రైలు దిగిన వెంటనే బస్సు దొరికింది. రవాణా ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి.
అక్కడి నుంచికొండ దిగువ భాగాన నూతనంగా నిర్మించిన డార్మెటరీ వద్దకు చేరుకున్న ఈవో డార్మెటరీలో ఉన్న భక్తులతో మాట్లాడారు.
ఈవో : ఎక్కడి నుంచి వచ్చారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి
ఎ.శ్రీనివాస్ : ‘అమలాపురం నుంచి వచ్చాను. డార్మెటరీ సౌకర్యంగానే ఉంది. స్నానానికి వేడి నీళ్లు సరఫరా చేస్తామన్నారు కానీ రావడం లేదు’ అని చెప్పగా.. పక్కనే ఉన్న సహాయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ‘ఇక్కడ సోలార్ సిస్టం అమర్చాం. ఇవాళ వాతావరణం మబ్బుపట్టి ఉండటంతో వేడినీరు అందలేద’ని వివరణ ఇచ్చారు.
పక్కనే ఉన్న మరో వ్యక్తిని ఈవో పలకరించి డార్మెటరీలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగారు.
ఎ.శివనాగబాబు : సామాన్య ప్రజలకు బాగా ఉపయోగంగా ఉంటోంది. బయట మంచం అద్దెకు తీసుకుంటే కనీసం రూ.50 వసూలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం రూ.10 మాత్రమే తీసుకోవడం వెసులుబాటుగా ఉంది.
ఈవో : ప్రస్తుతం చాప, దిండు ఇస్తున్నాం. భవిష్యత్‌లో దుప్పట్లు కూడా ఇచ్చి రూ.20 రుసుంగా నిర్ణయించే ఆలోచనలో ఉన్నాం.
అక్కడి నుంచి తలనీలాలు సమర్పించే ప్రాంతానికి ఈవో చేరుకున్నారు.
ఈవో : తలనీలాలు ఇచ్చే చోట మా సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తున్నారా.
ఎస్.శివ : మన సంతృప్తి మేరకు ఇస్తే డబ్బు పుచ్చుకుంటున్నారు గానీ డిమాండ్ చేయడం లేదు.
ఈవో : కల్యాణకట్టలో తలనీలాలు తీస్తున్న మా సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటోంది.
పి.దుర్గారావు : బాగానే ఉంటోంది కానీ కొంతమంది డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వకపోతే గాట్లు పెడతారేమోనని భయపడి ఇవ్వాల్సి వస్తోంది.
అక్కడి నుంచి ఈవో పూజలు, తలనీలాలు, ప్రసాదాలకు టిక్కెట్లు ఇచ్చే కౌంటర్ వద్దకు చేరుకున్నారు.
ఈవో : టిక్కెట్లు తొందరగానే అందుతున్నాయా. ఏమైనా ఇబ్బంది ఎదురవుతోందా?
ఎం.భూపతికుమార్ : తొందరగానే అందుతున్నాయి సార్.
అక్కడి నుంచి అన్నదానం నిర్వహించే భవనంలోకి అడుగుపెట్టారు.
ఈవో : ఏమ్మా.. భోజనం ఎలా ఉంది. నాణ్యత, రుచి ఎలా ఉన్నాయి.
గంగాదేవి : బాగుంది. ఉచిత భోజ నంలా లేదు. ఇంట్లో తిన్నట్టే ఉంది.
సౌకర్యాలకే ప్రాధాన్యం : ఈవో
నేను ఇక్కడ బాధ్యతలు స్వీకరించి దాదాపు రెండేళ్లు అవుతోంది. భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే అత్యధిక ప్రాధాన్యమిచ్చా. స్వామివారి సన్నిధిలో వివాహాలు చేసుకునే భక్తుల సౌకర్యార్థం గతంలో తాత్కాలికంగా ఉన్న షెడ్డును రూ.3.50 కోట్ల నిధులతో పక్కా మండపంగా నిర్మిస్తున్నాం. కొండ దిగువ నుంచి నేరుగా వాహనాలపై ఎగువకు వచ్చే వారి కోసం విశాలమైన ఘాట్ రోడ్డు నిర్మించాం. ప్రస్తుతం 5 వేల మందికి నిత్యాన్నదాన పథకం ద్వారా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. ఒకే సిట్టింగ్‌లో 350 మంది భక్తులకు భోజనం అందుతోంది. 750 మందికి ఒకేసారి భోజన పెట్టేలా రూ.14 కోట్లతో నూతన భవనం నిర్మిస్తున్నాం. కొండపై నాలుగు కల్యాణ మండపాలు అందుబాటులో ఉండగా భక్తుల విరాళాలతో ఒక్కొక్కటీ సుమారు రూ.45 లక్షల అంచనా వ్యయంతో 18 మినీ కల్యాణ మండపాలు నిర్మించడానికి ప్రతిపాదనలు చేశాం.21 కాటేజీలు ఇప్పటికే అందుబాటులో ఉండగా, మరో 7 నిర్మాణ దశలో ఉన్నాయి. సౌకర్యాలు కల్పించే విషయంలో భక్తులతో సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.