ఉప్పుతో భారతీయులకు పెనుముప్పే!
శరీరానికి ఉప్పు చేసే మేలు గొప్పదే. కానీ ఉప్పు మోతాదుకు మించి తింటే ముప్పు తప్పదు అంటున్నాయి పరిశోధనలు. మరీముఖ్యంగా ఉప్పు విషయంలో భారతీయులు పెద్ద తప్పు చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన దాని కన్నా రెట్టింపు మొత్తంలో భారతీయులు తమ ఆహారంలో ఉప్పు తీసుకుంటున్నారని, దీనివల్ల గుండె సంబంధిత జబ్బుల ముప్పు పెరగడమే కాకుండా.. హఠాన్మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
డబ్ల్యూహెచ్‌వో ప్రతిరోజు ఐదుగ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫారసు చేయగా.. 19 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన భారతీయులు ప్రతిరోజూ 10.98 గ్రాముల మేర ఉప్పు తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఉప్పును మరీ అధికంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఉప్పును తీసుకునే విషయంలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇక్కడ రోజుకు ఏకంగా 14గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారని, ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన దానికన్నా మూడు రెట్లు అధికమని తెలిపింది.
‘గత 30 ఏళ్లలో భారతీయుల సగటు ఆహార అలవాట్లు మారిపోయాయి. వారు పప్పులు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం తగ్గిపోయి.. ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల వారి ఆహారంలో పూర్తిస్థాయిలో ఉప్పు, చక్కెర, హానిచేసే కొవ్వు పదార్థాలు ఉంటున్నాయి. దీనివల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్‌లు ఎక్కువగా సంభవిస్తున్నాయి’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లైర్ జాన్సన్ తెలిపారు. ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు దారితీస్తున్నదని, ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతున్నదని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది.
ఉప్పును తీసుకొనే విషయంలో పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలాంటి తేడా లేదని, అయితే, పట్టణప్రాంత ప్రజలు తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నప్పటికీ పచ్చళ్లరూపంలో అధికమొత్తం ఉప్పును స్వీకర్తిస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు గుండెజబ్బులే కారణంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది గుండెజబ్బుల కారణంగా 23 లక్షలమంది ప్రాణాలు విడుస్తున్నారు. 2030నాటికి ఏకంగా అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అయి.. దేశ జనాభాలో 21.3 కోట్లమందికి చేరుకుంటుందని ఈ అధ్యయనం ఆందోళనపరిచే విషయాలు తెలిపింది. ‘భారత్ ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభం గురించి ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా లక్షలాది మంది ప్రతి ఏడాది ప్రాణాలు విడుస్తున్నారు’ అని జాన్సన్ పేర్కొన్నారు.
జాతీయంగా ఉప్పు తినడం తగ్గించేందుకు సెంటర్ ఫర్ క్రోనిక్ డిసీజ్ కంట్రోల్ (సీసీడీసీ)తో జార్జ్ ఇన్స్టిట్యూ్ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పనిచేస్తోంది. 2025నాటికైనా డబ్ల్యూహెచ్‌వో లక్ష్యం మేరకు దేశవ్యాప్తంగా ఉప్పు తీసుకోవడాన్ని 30శాతం మేర తగ్గించడానికి భారత్ ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ ఝా తెలిపారు.