క్రికెటర్ల తన్నులాట
బెర్ముడా ఆటగాడిపై జీవితకాల నిషేధం
హామిల్టన్ (బెర్ముడా) : క్రికెట్ మ్యాచ్‌ల్లో స్లెడ్జింగ్‌తో పాటు మాటా మాటా అనుకోవడం పరిపాటి. అయితే బెర్ముడాలోని ఓ క్లబ్ మ్యాచ్‌లో మాత్రం అది ముష్టిఘాతాల దాకా వెళ్లి ఒకరి జీవితకాల బహిష్కరణకు దారి తీసింది. క్రీడాస్ఫూర్తి మచ్చుకైనా కనిపించని ఈ ఘటన పది రోజుల క్రితం చాంపియన్ ఆఫ్ చాంపియన్స్ ఫైనల్ మ్యాచ్‌లో జరిగింది. బెర్ముడాకు చెందిన అంతర్జాతీయ ఆటగాడు జేసన్ అండర్సన్ క్లీవ్‌లాండ్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరఫున వికెట్ కీపింగ్ చేయగా విల్లో కట్స్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్‌మన్ జార్జి ఓబ్రియాన్ క్రీజులో ఉన్నాడు. అయితే వికెట్ల వెనకాల నుంచి అండర్సన్ పదేపదే మాటలతో ఓబ్రియాన్ను రెచ్చగొట్టాడు.
దీంతో సహనం కోల్పోయిన తను అండర్సన్‌తో గొడవకు దిగాడు. ఇదే ఊపులో అండర్సన్ అతడిపై ముష్టిఘాతాలకు దిగి కిందపడేసి తన్నడం ప్రారంభించాడు. ఇతర ఆటగాళ్లు, అంపైర్లు కలుగజేసుకుని ఇద్దరినీ విడదీసి బయటికి పంపారు. ఈ ఘటనపై ఆగ్రహం చెందిన బెర్ముడా క్రికెట్ బోర్డు అండర్సన్‌పై జీవితకాల నిషేధం విధించింది.