అడ్మిషన్ తీసుకొని వెళ్లగొట్టారు
కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘటన
వికారాబాద్ రూరల్: నెల రోజుల క్రితం పాఠశాలలో అడ్మిషన్ తీసుకొని అనంతరం బాలికను బయటకు పంపించారు. ఈ సంఘటన వికారాబాద్ పట్టణ పరిధిలోని కస్తూర్బా పాఠశాలలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. షాబాద్ మండలం మనుమర్రి గ్రామానికి చెందిన సత్యనారాయణ కూతురు సౌమ్య గురుకుల ప్రవేశ పరీక్ష రాసింది. వికారాబాద్ కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఆరో తరగతికి సీటు రావడంతో జూన్ 18న వికారాబాద్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో సౌమ్యను చేర్పించారు. నెల రోజులు గడిచాక బుధవారం పాఠశాల నుంచి సౌమ్య తండ్రి సత్యనారాయణకు ఫోన్ చేసిన ఉపాధ్యాయులు..మీ కూతురు అడ్మిషన్ విషయంలో మాట్లాడాలని చెప్పారు.
దీంతో సత్యనారాయణ గురువారం పాఠశాలకు చేరుకునేలోపు సౌమ్య పాఠశాల ఆవరణలోని చెట్టు కింద సామానుతో ఉంది. దీంతో ఆగ్రహానికి గురైన సత్యనారాయణ ఈ విషయమై ఉపాధ్యాయులను నిలదీయగా స్పందన రాలేదు. విషయం తెలుసుకున్న వికారాబాద్ జెడ్పీటీసీ ముత్తార్‌షరీఫ్ అక్కడికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. తల్లిదండ్రులు రాకముందే విద్యార్థినిని ఎలా బయటకు పంపిస్తారని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక ఉపాధ్యాయులు నీళ్లు నమిలారు. విద్యార్థిని మహబూబ్‌నగర్ జిల్లాలోని పాఠశాలలో చదవడంతో ఆమె అడ్మిషన్‌ను వెనక్కి పంపినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ స్వర్ణలత చెప్పారు. విద్యార్థిని జిల్లాలోని షాబాద్ మండలానికి చెందినా రెండేళ్ల పాటు మహబూబ్‌నగర్‌లో చదివిందన్నారు. అంతమాత్రాన జిల్లాకు సంబంధం లేనట్లుగా బయటకు పంపుతారా..? అని జెడ్పీటీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, నెలరోజుల పాటు విద్యార్థిని పాఠశాలలో భోజనం, బస చేసినందుకు ఉపాధ్యాయులు డబ్బులు అడిగారని ఆరోపించారు.