మాజీ ఎమ్మెల్యే కలానీకి యావజ్జీవం
సాక్షి, ముంబై: ఘనశ్యాం భతీజా హత్య కేసులో ఉల్హాస్నగర్ మాజీ ఎమ్మెల్యే సురేశ ఎలియాస్ పప్పూ కలానీ సహా మరో ముగ్గురికి మంగళవారం కల్యాణ్ సెషన్స్ కోర్టు యావజ్జీవశిక్ష ఖరారు చేసింది. రాజకీయ కక్షల వల్లే కలానీ 1990 ఫిబ్రవరి 27న ఠాణే జిల్లాలోని పింటో రిసార్ట్స్ వద్ద ఘన భతీజాను హతమార్చాడని పోలీసులు ఆరోపించారు. ఈ హత్యతో కలానీతోపాటు మరో ఐదుగురు సహచరుల ప్రమేయమున్నట్లు గుర్తించారు. గత శుక్రవారం ఈ కేసుపై తుది విచారణ జరిపిన అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజేశ్వరి బాపట్ కలానీతోపాటు ఆయన అనుచరులు బాబా గాబ్రియల్, బచ్చీపాండే, అర్షద్ షేక్‌ను దోషులుగా నిర్ధారించడం తెలిసిందే. సరైన సాక్ష్యాలు లేకపోవ డంతో నరేంద్ర రామ్సింఘానీ, రిచర్డ్ ఫెర్నాండెజ్ అనే ఇద్దరిని ఆమె నిర్దోషులుగా విడుదల చేశారు. కలానీపై ఇది వరకే టాడా వంటి అనేక కేసులు నమోదయ్యాయి. వాటి నుంచి విముక్తి లభించినప్పటికీ తన సహచరులతో కలిసి 1990లో ఘనశ్యాం భతీజాను హత్య చేశాడు.
ఈ ఘటనకు ప్రధానసాక్షి, ఘనశ్యాం సోదరుడు ఇందర్‌ను కూడా 1999లో హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కలానీకి ఉరి శిక్ష ఖరారు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే న్యాయమూర్తి ఈ మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు శిక్ష విధించారు. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని కలానీ వకీలు దీపక్ మిశ్రా చెప్పారు. ఇదిలాఉండగా జైలులో ఉంటూనే 1990 నుంచి కలానీ నాలుగుసార్లు ఉల్హాస్నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇతడికి ఎన్సీపీ అధిష్టానం అండ ఉండడంతో అప్పట్లో ఎవరూ ఎదురించలేదని చెబుతారు. కాలక్రమేణా ప్రతిపక్ష నాయకులు క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఇతనికి కష్టాలు మొదలయ్యాయి. కలానీకి జీవిత ఖైదు శిక్షపడడంతో కల్యాణ్-ఉల్లాస్‌నగర్ ప్రాంతాల్లో ఎన్సీపీకి గట్టి దెబ్బ తగిలిందని భావిస్తున్నారు.