నాలుగు నెలలుగా పామాయిల్ నిల్
ఘట్కేసర్ టౌన్: చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీ ధరల్లో విక్రయించే పామాయిల్ నాలుగు నెలలుగా సరఫరా కావడం లేదు. ఏప్రిల్‌లో జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ దుకాణాలకు పామాయిల్ సరఫ రా నిలిచిపోయింది. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలైనా పామాయిల్ సరఫరా కాక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బహిరంగ మార్కెట్లో అధిక ధరలను వెచ్చించి కొనుగోలు చేస్తున్నా రు. దీంతో జిల్లావ్యాప్తంగా 10.85 లక్షల లబ్ధిదారులపై ఆర్థికభారం పడుతోంది.
నిర్ణయం తీసుకునేవారేరీ...
రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన పామాయిల్ మలేసియా నుంచి దిగుమతి అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలకు కావలసిన పామాయిల్‌ను టెండర్ల ద్వారా కాంట్రాక్టుకు ఇచ్చేవారని తెలుస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పడక ముందు గవర్నర్ పాలన ఉండడం వల్ల టెండర్ల ప్రక్రియను చేపట్టకపోవడంతో పామాయిల్ కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర సర్కారు వద్ద పామాయిల్ నిల్వలు లేనందున రేషన్ దుకాణాలకు సరఫరా చేయలేకపోతోంది.
కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి పామాయిల్‌పై నిర్ణయం తీసుకునేంతవరకు పామాయిల్ వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. రేషన్ దుకాణాల్లో రాయితీ ధరలో రూ. 40కు లభించే కిలో పామాయిల్ బహిరంగ మార్కెట్లో 65-70 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో పేదలపై నెలకు కోట్లాది రూపాయల భారం పడుతోంది. కాగ పామాయిల్ సరఫరాపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి సమాచారం అందలేదని, అధికారుల ఆదేశానుసారమే రేషన్ దుకాణాలకు పామాయిల్‌ను సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ప్రభు తెలిపారు.