ప్రముఖ హోటళ్లలో కుళ్లిన మాంసం
హైదరాబాద్: నగరంలోని పలు హోటళ్లను జీహెచ్ఎంసీ ప్రజారోగ్య శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు హోటళ్లలో తనిఖీలు చేసి భారీగా జరిమానా విధించారు. పాచిపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచిన దిల్సుఖ్నగర్లోని శివాని హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ హోటల్ నుంచి చెడిపోయిన ఆహారపదార్థాలను, కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వంటగది అపరిశుబ్రంగా ఉండడంతో దిల్సుఖ్నగర్లోని గ్రీన్ బావర్చి హోటల్, శిల్పి హోటళ్లకు రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. అదే విధంగా హోటల్ బృందావనంలో తనిఖీలు చేపట్టి పాడైన పదార్థాలను గుర్తించారు. హోటల్ యాజమాన్యానికి రూ. 5 వేలు జరిమానా విధించారు. జీహెచ్ఎంసీకి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్, వెటర్నరీ డాక్టర్, ప్రజారోగ్య శాఖ అధికారి తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. పలు హోటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి.