ఆలన లేని పురపాలన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పాలన గాడినపడటం లేదు. జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలోని మిగిలిన 72 మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు అరకొర ఉద్యోగులతో నెట్టుకొస్తున్నాయి. జనాభాకు తగ్గట్లు మానవ వనరులు లేక పురపాలికలు స్థానిక ప్రజలకు కనీస సదుపాయాలు, మౌలిక సేవలు అందిం చ లేకపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే జూన్ 1 నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 71 పురపాలికలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఉన్న 72 పురపాలికల్లో తీవ్ర ఉద్యోగుల కొరత ఉండగా, కొత్తగా ఏర్పాటు కానున్న పురపాలికలకు ఉద్యోగులను సర్దుబాటు చేయడంపై పురపాలక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పురపాలికల్లో ప్రజలకు వేగంగా పౌర సేవలందించేందుకు ప్రభుత్వం సంస్కరణలను అమల్లోకి తీసుకువచ్చింది. అయితే, చాలా మునిసిపాలిటీల్లో సరిపడ సంఖ్యలో ఉద్యోగులు లేక ఈ సంస్కరణలు అమలు కావడం లేదు.
పెండింగ్‌లోనే పోస్టుల భర్తీ ప్రతిపాదనలు
నాలుగేళ్ల కింద కొత్తగా ఏర్పాటైన 11 నగర పంచాయతీల కోసం 1,100 కొత్త పోస్టులు సృష్టించాలని రాష్ట్ర పురపాలక శాఖ పంపించిన ప్రతిపాదనలు గత మూడేళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. రెండేళ్ల కింద ఏర్పాటు చేసిన మరో 4 పురపాలికలకు అవసరమైన పోస్టులను సైతం ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో ఇతర పురపాలికల నుంచి ఉద్యోగులను సర్దుబాటు చేశారు. పాత పురపాలికలకు మంజూరైన పోస్టుల్లో 26 గ్రేడ్–2 మునిసిపల్ కమిషనర్లు, 19 గ్రేడ్–3 మునిసిపల్ కమిషనర్ల పోస్టులతో పాటు ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్ విభాగాల్లో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్ని పురపాలికలకు ఇన్చార్జీ కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. దీనికితోడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న 71 మునిసిపాలిటీల్లో కనీసం 2,556 కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేయాల్సి ఉంది.