గిఫ్ట్‌ప్యాక్
ఓటర్లకు సరికొత్త తాయిలాలు
అందరికీ బహుమతులు
అభ్యర్థుల ‘ఓటు’ రూట్లు
ఎన్నికల ప్రచారంలో.. ప్రలోభాల పర్వం మొదలైంది. ‘ఓటే ముఖ్యం...గెలుపే లక్ష్యం’. ఎంతైనా సరే.. ఏదైనా సరే. నగానట్రా.. మందు.. విందు.. చిందు.. దేనికైనా రెడీ. ‘సింగిల్’గానైనా.. ‘ఫ్యామిలీ’ ప్యాకేజీగానైనా ఓకే. ‘ఓటు మాకు.. నజరానా మీకు’... ఇదీ అభ్యర్థుల నినాదం. - సాక్షి,సిటీబ్యూరో
మహిళలకు గాజులు... చీరెలు.. పురుషులకు మందు... విందు... చిందు.. ఇదేదో శుభకార్యాల్లో కనిపించే తంతు అనుకుంటున్నారా? కాదు... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ‘గిఫ్ట్ ప్యాక్’. అంతే కాదు... యువతకు క్యారమ్స్, క్రికెట్ కిట్లు కూడా ఉన్నాయి. ‘మీ అమూల్యమైన ఓటు మాకు.. ప్యాకేజీ మీకు’ అంటూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఇంటిల్లిపాదినీ ఖుషీ చేసి గంపగుత్తగా ఓట్లు కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ.. ఈ పార్టీ అన్న తేడా లేదు. అన్నిటిదీ ఒకేబాట. ఇదే పాట.
సెంటిమెంట్‌తో...
మహిళల సెంటిమెంట్‌ను ఓట్లుగా మలచుకునేందుకు అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం 75 స్థానాల్లో మహిళా అభ్యర్థులే ఉండడంతో.. ప్రధాన పార్టీలు వారి ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాయి. మహిళా సెంటిమెంట్‌ను అనుకూలంగా మార్చుకుంటున్నాయి. వెండి కుంకుమ భరిణెలు, కంచాలు, చీరెలు, డిన్నర్ సెట్లు, వంట పాత్రలు, గాజులు, తిరుమల, యాదాద్రి లడ్డూల పంపిణీతో వారి మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బహుమతులతో వారిని కట్టిపడేస్తున్నాయి. ఆ తర్వాత ‘మీ ఓటు మాకే..’ అంటూ చేతిలో చేయి వేయించుకొంటున్నాయి. శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రచారం ఇప్పుడిప్పుడే జోరందుకుంటోం ది. ఓట్ల కొనుగోలుకు అభ్యర్థులు రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక పంపిణీ కూడా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. ఉదయం ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ, కరపత్రాలు పంచుతూ సాదాసీదాగా ఎన్నికల ప్రచా రం నిర్వహిస్తున్న అభ్యర్థులు... మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో తాయిలాలు అందించే పనిలో పడ్డారు. దీనికి భారీగా ఖర్చవుతున్నా వెనుకాడడం లేదు. ఖర్చు పరిమితికి మించిపోతుం దన్న భయం వెంటాడుతున్నా.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనివ్వాలంటే ‘బహుమతి ప్రదానం’ తప్పదని చెబుతుండడం గమనార్హం.
మందు.. విందు.. ఓట్ల పసందు
అభ్యర్థులు మందు పార్టీలతో పురుషుల ఓట్లకు గాలం వేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, బస్తీ, కాల నీల వాసులకు మస్తు పసందు చేస్తున్నారు. ఉద యం, సాయంత్రం ప్రచారం.. రాత్రికి ‘సిట్టింగ్ ’లకు ప్లాన్ చేస్తున్నారు. ఈ బాధ్యతను బస్తీలు, కాలనీల సంక్షేమ సంఘాలకు అప్పగిస్తున్నారు అభ్యర్థులు. మందు, ఇతర ఆహార పదార్థాలు వారే కొనుగోలు చేసుకునేందుకు అవసరమైన ఖర్చులను రహస్యంగా ఇస్తున్నారు. పార్టీల స్థానిక కార్యాలయాల్లో రోజువారీగా ఏ కాలనీ లేదా బస్తీ వారికి ఎక్కడ పార్టీ ఏర్పాటు చేయాలన్న అంశంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. పార్టీ ఎలా జరుగుతోంది..? ఏమైనా లోటుపాట్లున్నాయా? అని అభ్యర్థులు ఫోన్లో ఎప్పటికప్పుడు తెలుసుకుం టూ ఓటర్లను ఖుషీ చేస్తున్నారు. ఇక యువ ఓటర్ల కు క్రీడా పరికరాలతో ఎర వే స్తున్నారు. యువతను తమవైపు తిప్పుకునేందుకు క్రికెట్ కిట్లు, క్యారమ్స్, చెస్ బోర్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
‘పార్టీ’ రూటు.. సెపెరేట్
బార్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో ఆర్భాటంగా పార్టీలు నిర్వహిస్తే ఈసీ డేగకన్నుకు దొరికిపోతామ న్న భయంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కాలనీ, బస్తీల్లోని పురాతన షెడ్లు, ఖాళీ ఫ్లాట్లు లేదా సంక్షేమ సంఘాల అధ్యక్షుల నివాసాలు మందు పార్టీలకు వేదికలుగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా ఏం పార్టీ అని ప్రశ్నిస్తే ‘మా కూతురు లేదా బాబు పుట్టిన రోజు... లేదా బస్తీ నాయకుడి పెళ్లి రోజని’ చెబుతూ అభ్యర్థుల గుట్టురట్టు కాకుండా జాగ్రత్త పడుతున్నారు.