జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ రోడ్లే రీకార్పెటింగ్ చేస్తున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: గతంతో పోలిస్తే నగరంలో రహదారుల అవస్థలు కొంతమేర తగ్గాయి. గతంలో మాదిరిగా ఎగుడుదిగుళ్లు.. అధ్వానపు రహదారులు అన్ని ప్రాంతాల్లో లేవు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించిన సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద ప్రధాన రహదారుల మార్గాల్లో 709 కి.మీ మేర పనుల్ని పేరెన్నికగన్న పెద్ద ఏజెన్సీలకు కాంట్రాక్టుకిచ్చారు. కాంట్రాక్టులో భాగంగా ఎప్పటికప్పుడు రోడ్లను సాఫీ ప్రయాణానికి అనుగుణంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. అంతే కాదు.. రోడ్ల మధ్య డివైడర్లు, రోడ్ల పక్కల ఫుట్‌పాత్‌లు.. రోడ్డుకిరువైపులా పచ్చదనం పెంపు తదితర పనులు సైతం వాటివే. అంతేకాదు.. పారిశుద్ధ్య నిర్వహణ కూడా వాటిదే. ఫుట్‌పాత్‌లు, పారిశుద్ధ్యం, డివైడర్ల నిర్వహణ వంటి పనుల సంగతెలా ఉన్నా ప్రధాన రహదారుల మార్గాల్లో మాత్రం ఇదివరకులా సమస్యల్లేవు.
బాగున్న రోడ్లే మళ్లీ మళ్లీ..
సీఆర్ఎంపీలో భాగంగా నిధుల ఖర్చు చూపేందుకు బాగున్న రోడ్లనే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా వీఐపీలు పర్యటించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లతో పాటు హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బాగున్న రోడ్లకే రీకార్పెటింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో జరుపుతున్న మిల్లింగ్ శాస్త్రీయంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో రోడ్డు ఎత్తు పెరుగుతోందని, మరమ్మతుల సందర్భంగా డైవర్షన్లకు సైనేజీల ఏర్పాట్లు వంటివి చేయడం లేదనే ఫిర్యాదులున్నాయి.
శివారు సమస్యలు పట్టవా..?
ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వగా.. మిగిలిన ఇతర మార్గాలు.. ముఖ్యంగా శివార్లలోని రోడ్లు.. అక్కడి కాలనీల్లోని అంతర్గత రహదారులు మాత్రం మారలేదు. దాదాపు 300 కి.మీ మేర మెటల్ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదించినా పనులు జరగలేదు. దీంతో అక్కడి సమస్యలు తీరలేదు. వానలొస్తే బురదమయంగా మారుతున్న రోడ్లతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. జోనల్ కమిషనర్లకే అధికారాలివ్వడంతో వారు ఆడింది ఆటగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రధాన కార్యాలయం ప్రే„ý కపాత్ర వహించడం మాని.. పర్యవేక్షించాలని పలు ఎన్జీఓ సంఘాలు, ప్రజలు కోరుతున్నారు.
శివారు ప్రాంతాల్లోనూ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, లేని పక్షంలో సంబంధిత ఏఈలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 16వేల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో పరిష్కరించకుంటే సీఆర్ఎంపీ ఏజెన్సీలకు పెనాల్టీలు విధించి, బిల్లుల చెల్లింపుల్లో మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 15లక్షల పెనాల్టీలు విధించినట్లు పేర్కొన్నారు. కచ్చితమైన లెక్కలు జోన్లనుంచి అందాల్సి ఉందన్నాన్నారు.
సీఆర్ఎంపీ.. స్వరూపం..
► గ్రేటర్లో మొత్తం రోడ్లు: 9013 కి.మీ.
► సీఆర్‌ఎంపీలోని రోడ్ల పొడవు: 709 కి.మీ
► అయిదేళ్ల వరకు నిర్వహణతో సహా మొత్తం అంచనా వ్యయం : రూ1839 కోట్లు
► సీఆర్ఎంపీ పనులకు ఇప్పటి వరకు చేసిన ఖర్చు : రూ.594
► ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఇప్పటి వరకు ఖర్చు రూ.177.98 కోట్లు
► ఇప్పటి వరకు రీకార్పెట్ చేసిన మొత్తం రోడ్లు: 496 కి.మీ
► ఈ ఆర్థిక సంవత్సరంలో రీకార్పెట్ చేసిన రోడ్లు:124 కి.మీ
జీహెచ్ఎంసీలో ఇతర మార్గాల్లో చేసిన రోడ్ల పనులు
► ఈ ఆర్థిక సంవత్సరం మంజూరైన పనులు: 2,562
► అంచనా వ్యయం: రూ 644కోట్లు
► ఇప్పటి వరకు పూర్తయిన పనులు: 802
► వీటికైన వ్యయం: రూ. 177 కోట్లు
► పురోగతిలోని పనులు: 1,760
► వాటి అంచనా వ్యయం రూ.467 కోట్లు
► 2021లో పూడ్చిన గుంతలు: 15,696
► ఈ ఆర్థిక సంవత్సరం పరిష్కరించిన ఫిర్యాదులు: 15,849.