అనర్హులను అడ్డుకోండి...
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సూచన
బూత్‌ల వద్ద క్యూ ఉంటే ఓటరుకు మెస్సేజ్
జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ వెల్లడి
పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశం
కవాడిగూడ,న్యూస్‌లైన్: ఈసారి ఎన్నికల్లో అనర్హులు నామినేషన్ దాఖలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సాధారణ ఎన్నికల జీహెచ్ఎంసీ రౌండ్‌టేబుల్ సమావేశం సోమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లోయర్‌ట్యాంక్‌బండ్ హోటల్ మారియట్‌లో జరిగింది.
దీనికి భన్వర్‌లాల్‌తోపాటు హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ప్రత్యేక కమిషనర్ రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికలకంటే ఈసారి ఎన్నికల్లో 20శాతం పోలింగ్ పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూఅధికంగా ఉండటం కారణంగా చాలామంది వెనుదిరిగి వెళ్తున్నారని, ఈ పరిస్థితి నివారించేందుకు ఓటర్లకు ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించే యోచన ఉన్నట్లు చెప్పారు. పోలింగ్‌బూత్‌ల వద్ద ఎంతమంది క్యూలో ఉన్నారు అనే విషయాన్ని ఓటర్లకు సమాచారమిచ్చేందుకు ప్రత్యేక ఎస్ఎంఎస్ నంబర్ ను తయారుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీకాకుండా జీహెచ్ఎంసీ 21111111 నంబర్ కు ఫోన్‌చేసి సమాచారమడిగితే వివరాలు చెబుతారని తెలిపారు. రెండురోజుల్లో ప్రత్యేక ఎస్ఎంఎస్ నంబర్‌ను ప్రకటిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎంకే మీనా మాట్లాడుతూ నియె ూజకవర్గాల్లోని సెక్టార్లలో అసిస్టెంట్ సెక్టార్ అధికారి అత్యంత క్రియాశీలకంగా పనిచేయాలని, అసిస్టెంట్ సెక్టార్ అధికారులను సెక్టార్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్‌బూత్‌ల వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించా రు.
పోలింగ్‌బూత్‌ల వద్ద అన్నిరకాల సదుపాయాలు సమకూర్చాలంటూ.. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచార వ్యయంపై ఎప్పటికప్పుడు అధికారులు నివేదిక తయారుచేసి పంపాలన్నారు. ముందుగానే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, పోలింగ్‌బూత్‌లను ఓటర్లకు పరిచయం చేయడం, పోలింగ్‌రోజును ఓటర్లకు తెలియజేయడం, బూత్‌ల వద్ద రిస్పెషన్ల ఏర్పాట్ల గురించి వివరించా రు.
ఈసందర్భంగా జీహెచ్ఎంసీ 24 నియోజకవర్గాల్లో జరిపిన సర్వేవివరాలను అధికారులకు వివరించారు. ఇందులో 93.67 శాతం మందికి ఓటరు ఐడీకార్డులు ఉన్నట్లు తేలిందని, 86శాతం మంది ఎన్నికలు జరుగుతున్నట్లు టీవీల ద్వారా తెలుసుకున్నారని, ఎస్సీలు, వీకర్‌సెక్షన్‌కాలనీల్లో ఎన్నికలు ఉన్నట్లుగా తమకు తెలియదని 30 నుంచి 40 శాతం మంది చెప్పినట్లు కలెక్టర్ తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎస్ఎంఎస్
ఎన్నికలకు సంబంధించి ప్రజల సమస్యలు.. వివిధ రకాల ఫిర్యాదులు ఎస్ఎంఎస్ ద్వారా స్వీకరించి పరిష్కరించేందుకు అధికారులు కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదు రాగానే అది అందిన విషయాన్ని తెలియజేస్తారు. సమస్య పరిష్కారం కోసం వెంటనే దాన్ని సంబంధిత అధికారికి ఎస్ఎంఎస్ చేస్తారు.