ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం
సిటీబ్యూరో: మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలతో పాటు సిబ్బందిని వెంటనే నియమించనున్నట్టు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ శుక్రవారం రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు దాఖలైన 2,118 దరఖాస్తులను వెంటనే పరిశీలించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని బ్యాలెట్‌బాక్స్‌లను స్థానిక ఎన్నికల నిమిత్తం ఇతర జిల్లాలకు పంపించామని, వాటిని తిరిగి తెప్పిస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 151 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్ల సంఖ్య 1200కన్నా మించితే అదనపు కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఓటర్ల జాబితాలో 40 శాతం మందివి ఫొటోలు ఉన్నాయని వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ కమిషనర్లు హరికృష్ణ, రవికిరణ్ పాల్గొన్నారు.
అమల్లోకి ప్రవర్తనా నియమావళి..
అంతకుముందు మీడియాతో సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు జీహెచ్ంఎసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు), మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల డీఆర్ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు. 413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 2,86,311 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని 97 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 66,100 ఓటర్లు, రంగారెడ్డి జిల్లాలో 165 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,33,003 మంది, హైదరాబాద్ జిల్లాలోని 151 పోలింగ్ కేంద్రాల పరిధిలో 87,208 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని వివరించారు. మొత్తం ఓటర్లలో పురుషులు 1,92,110 మంది కాగా, మహిళలు 94,188 మంది, ఇతరులు 13 మంది ఉన్నట్టుచెప్పారు. నామినేషన్ వేసేందుకు జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.5 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు.