అజంతా అందాలు...
చూసొద్దాం రండి
నగరం నడిబొడ్డున పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉన్న రాష్ట్ర పురావస్తు మ్యూజియం.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముందుచూపునకు నిదర్శనం. 95 ఏళ్ల కిందట నిజాం ఒక మ్యూజియం నిర్మించాలనుకున్నాడు. అందుకోసం చారిత్రక పరిశోధకుడు జనాబ్ గులాం యజ్దానీని 1914లో ఆర్కియాలజీ శాఖ డెరైక్టర్‌గా నియమించాడు. 1930లో పబ్లిక్‌గార్డెన్స్‌లోని విశాల ప్రాంగణంలో ఇండో-ఇస్లామిక్ శైలిలో హైదరాబాద్ మ్యూజియం నిర్మితమైంది. అనేక తవ్వకాలలో లభించిన అరుదైన కళాఖండాలకు ఇది నిలయం. రెండంతస్తుల భవనం.. దీని వెనుకే మరో రెండు అంతస్తుల్లో విశాలమైన కాంటెంపరరీ పెవిలియన్ నిర్మించారు. ఈ రెండింటి నడుమ విజయనగర రాజుల కాలంనాటి ఎత్తై కొయ్య రథం ఒక ప్రత్యేక ఆకర్షణ. పక్కనే కాకతీయుల కాలం నాటి మహామండపం, ఆ పిల్లర్లపై చెక్కిన శివపార్వతుల శిల్పాలు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక.
ఈజిప్టు దేశపు మమ్మీ.. అజంతా గ్యాలరీ
మ్యూజియంలో క్రీ.పూ.2500 ఏళ్లనాటి ఈజిప్టు దేశపు మమ్మీ ప్రధాన ఆకర్షణ. ఇది 16-18 ఏళ్ల వయసుగల ఆడపిల్లకు సంబంధించినదని అధికారులు చెబుతారు. మనదేశంలో కేవలం ఆరు మ్యూజియంలలో మాత్రమే మమ్మీలున్నాయి. ఈ మమ్మీని ఆరో నిజాం అల్లుడు కొనుగోలు చేసి దాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను బహుమతిగా ఇచ్చారు. నిజాం దాన్ని 1930లో గ్యాలరీకి అప్పగించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా చిత్రాల నకళ్లు ఈ మ్యూజియంలో దగ్గరగా చూడొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు చిత్రకారులు జనాబ్ సయ్యద్ అహ్మద్, జనాబ్ మహ్మద్ జలాలుద్దీన్‌లు అజంతాలోని చిత్రాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎంతో ఓర్పుతో చిత్రించారు. ఇవి బుద్ధుని జాతక కథలతోపాటు ఆనాటి జీవన విధానాన్ని తెలుపుతాయి.
చేతివ్రాత ప్రతులు, అరుదైన నాణేలు
మొఘల్ చక్రవర్తి షాజహాన్ సీల్‌తో ఉన్న ఖురాన్, ఔరంగజేబు చేతితో రాసిన ఖురాన్ ప్రతులు, క్రీ.శ. 16 నుంచి 19వ శతాబ్దకాలంలో అరబిక్, పర్షియన్, హిందీ భాషలలోని అనేక పత్రాలు, 16, 17 శతాబ్దాల్లో దేవనాగరి లిపిలో రాసిన రామాయణ, భాగవత ప్రతులు చారిత్రకాభిమానులను విశేషంగా అకట్టుకుంటున్నాయి. సుమారు రెండున్నర లక్షల పైబడిన నాణేలు మ్యూజియం గ్యాలరీలో భద్రపరిచారు. రోమన్ కాలం నాటి బంగారు నాణేలు, చైనీయుల రాగి నాణేలు, షాజహాన్ కాలంలోని 200 తులాల బంగారు మొహర్ అరుదైన జ్ఞాపికలుగా ఉన్నాయి. అయితే వీటి ప్రదర్శన ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో లేదు.
జైన, బుద్ధుని గ్యాలరీలు
అమరావతి, చందవరం, నేలకొండపల్లి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన బుద్ధుని శిలాప్రతిమలు ఒక ప్రత్యేక గ్యాలరీలో ఉంచారు. ఇందులో ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో లభించిన బుద్ధుని నిలువెత్తు విగ్రహం సందర్శకులను కట్టిపడేస్తుంది. కళ్యాణ చాళుక్యుల కాలం నాటి ఐదుగురు జైన తీర్థంకరుల శిల్పాలు, అన్నపూర్ణ, లక్ష్మీనారాయణ, లక్ష్మి, వరాహ, సూర్య, హిందూ దేవతామూర్తులు శిల్పి నైపుణ్యతకు అద్దం పడుతున్నాయి. ఇంకా మొఘల్, రాజస్తానీ, దక్కన్ చిత్రాలతో పాటు స్థానిక ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్స్ ఈ గ్యాలరీలో కనువిందు చేస్తాయి. ఈ మ్యూజియమ్‌కు ప్రతి శుక్రవారం సెలవు. ఆదివారం తెరిచే ఉంటుంది!.