gift coupons
-
గూగుల్ పేలో డిజిటల్ గిఫ్ట్ కార్డ్‌లు
పైన్ ల్యాబ్స్ యాజమాన్యంలోని సంస్థ క్విక్ సిల్వర్ భాగస్వామ్యంతో గూగుల్ పే తన ప్లాట్ఫామ్లో డిజిటల్ గిఫ్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఇది 150 కంటే ఎక్కువ ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ బ్రాండ్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను 1500 నగరాల్లోని భారతదేశంలోని ప్రజలకు అందించనున్నట్లు తెలిపింది. ఈ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, ఉబెర్ ఇ-గిఫ్ట్, అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ మరియు గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ మొదలైనవి ఉన్నాయి. క్విక్ సిల్వర్ మరో కన్జ్యూమర్ బ్రాండ్ అయిన వోహోను గూగుల్ పే స్పాట్ ప్లాట్ ఫాంపై లిస్ట్ చేసింది. దీని ద్వారా ఆఫ్‌లైన్ వ్యాపారాలు గూగుల్ పేలో వర్చువల్ గిఫ్ట్ కార్డులను తయారుచేయవచ్చు. వోహో, గూగుల్ పే భాగస్వామ్యంతో ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్ పెరగనుంది. ఎందుకంటే వినియోగదారులు ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి వర్చువల్ గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతారు. గూగుల్ పేలో వోహోను సెర్చ్ చేయడం ద్వారా వర్చువల్ బహుమతి కార్డును పంపవచ్చు. అది కాకపోయినా బిజినెస్ ట్యాబ్ లో ఉండే గిఫ్ట్ కార్డ్ స్టోర్ లోని కార్డులలో ఎంచుకుని పంపుకోవచ్చు. ఒక్కసారి కొంటే ఆ డిజిటల్ కార్డును ఈ మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా పంపుకోచ్చు. అప్పుడే మనకు రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ పొందడానికి అర్హులం అవుతాం. భారతదేశంలోని 10 బహుమతి కార్డులలో తొమ్మిది కార్డులు ఇ-కామర్స్, కిరాణా మరియు ఫ్యాషన్ విభాగానికి చెందినవి. క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది. బటన్ క్లిక్ చేసి డిజిటల్ గిఫ్టింగ్ విధానం ద్వారా కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్ మరింత బెటర్ గా పొందొచ్చని పైన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ కుమార్ సుదర్శన్ స్టేట్మెంట్లో చెప్పారు. గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం అనేది గతేడాదే లాంచ్ అయింది. వ్యాపారులు తమ స్పాట్‌ను గూగుల్ పేలో సెటప్ చేయడానికి గూగుల్ స్పాట్ ప్లాట్ ఫాం ద్వారా వీలు కల్పించారు. -
పాల టోకెన్లు, గిఫ్ట్ కూపన్లు
న్యూఢిల్లీ: పాల టోకన్లు, గిఫ్ట్ కూపన్లు, ఫోన్ రీచార్జి కూపన్లు..! జయలలిత మరణంతో ఖాళీ అయిన తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పార్టీలు ఎరవేసిన తాయిలాల్లో ఇవి కొన్ని మాత్రమే. కాదేదీ లంచానికి అనర్హం అన్న రీతిలో పార్టీలు సరికొత్త లంచాలకు తెరతీసినట్లు ఎన్నికల సంఘం దర్యాప్తులో తేలింది. అన్నాడీంకే(అమ్మ) వర్గం ఓటర్లకు రూ.90 కోట్లు పంచినట్లు ఆరోపణలు రావడంతో ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. ఎన్నికల నిబంధనల నుంచి తప్పించుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో కొత్తకొత్త మార్గాల్లో లంచాలకు తెరతీస్తున్నారని ఈసీ 33 పేజీల రద్దు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆర్కే నగర్లో పార్టీలు దినపప్రతికల చందాలు, బ్యాంకు ఖాతాల్లో, మొబైల్ వ్యాలెట్లలలో డబ్బులు తదితర మార్గాల్లో లంచాలు ఎరవేశారంది. రూ.18.8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. తమ పార్టీని దెబ్బతీయడానికి కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలిపిందని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి, ఆర్కే నగర్లో ఆ పార్టీ అభ్యర్థి దినకరన్ ఆరోపించారు. -
గిఫ్ట్ కూపన్ల పేరుతో మోసం
సైదాబాద్ (హైదరాబాద్) : గిఫ్ట్ కూపన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైదాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేర విభాగం ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన కమ్రాన్ ఖాన్(29), అఫీజ్ ఉర్ రహమాన్లు స్థానికంగా శంకేశ్వర్ బజార్ వద్ద రిలయబుల్ హోమ్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో సంస్థను తెరిచారు. అఫీజ్ సంస్థకు చైర్మన్‌గా, కమ్రాన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా కొనసాగుతూ పెద్ద షాపింగ్ మాల్స్ వద్ద ఒక బాక్స్ పెట్టి, గిఫ్ట్ కూపన్లను అందుబాటులో ఉంచేవారు. అక్కడకు వచ్చే వినియోగదారులు తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు రాసి గిఫ్ట్ కూపన్ల బాక్సులో వేయసాగారు. ఆ కూపన్ల ఆధారంగా వారికి ఫోన్ చేసి తమ సంస్థ తరఫున గిఫ్ట్ గెలుచుకున్నారని, తమ సంస్థ ఆధ్వర్యంలో ఒక వెంచర్‌ను ఏర్పాటు చేశామని, అందుకుగాను రూ.12 వేలు చెల్లించి సభ్యులుగా చేరితే చాలని నమ్మించసాగారు. ఈ విధంగా గత డిసెంబరు నుంచి ఎందరినో మోసగించి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. వినియోగదారులు తమకు కేటాయించిన ఓపెన్ ఫ్లాట్ చూపించాలని ఒత్తిడి తీసుకురాగా తప్పించుకు తిరగసాగారు. వీరిపై అనుమానం వచ్చిన కొందరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో మోసం చేసినట్లు వారు అంగీకరించడంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి నకిలీ సంస్థ సభ్యులు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దని.. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని ఇన్స్పెక్టర్ కోరారు.