సైదాబాద్ (హైదరాబాద్) : గిఫ్ట్ కూపన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సైదాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నేర విభాగం ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన కమ్రాన్ ఖాన్(29), అఫీజ్ ఉర్ రహమాన్‌లు స్థానికంగా శంకేశ్వర్ బజార్ వద్ద రిలయబుల్ హోమ్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో సంస్థను తెరిచారు.
అఫీజ్ సంస్థకు చైర్మన్‌గా, కమ్రాన్ మేనేజింగ్ డెరైక్టర్‌గా కొనసాగుతూ పెద్ద షాపింగ్ మాల్స్ వద్ద ఒక బాక్స్ పెట్టి, గిఫ్ట్ కూపన్లను అందుబాటులో ఉంచేవారు. అక్కడకు వచ్చే వినియోగదారులు తమ పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు రాసి గిఫ్ట్ కూపన్ల బాక్సులో వేయసాగారు. ఆ కూపన్ల ఆధారంగా వారికి ఫోన్ చేసి తమ సంస్థ తరఫున గిఫ్ట్ గెలుచుకున్నారని, తమ సంస్థ ఆధ్వర్యంలో ఒక వెంచర్‌ను ఏర్పాటు చేశామని, అందుకుగాను రూ.12 వేలు చెల్లించి సభ్యులుగా చేరితే చాలని నమ్మించసాగారు.
ఈ విధంగా గత డిసెంబరు నుంచి ఎందరినో మోసగించి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. వినియోగదారులు తమకు కేటాయించిన ఓపెన్ ఫ్లాట్ చూపించాలని ఒత్తిడి తీసుకురాగా తప్పించుకు తిరగసాగారు. వీరిపై అనుమానం వచ్చిన కొందరు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణలో మోసం చేసినట్లు వారు అంగీకరించడంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి నకిలీ సంస్థ సభ్యులు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఎవరూ మోసపోవద్దని.. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.
గిఫ్ట్ కూపన్ల పేరుతో మోసం
Published Mon, Nov 2 2015 6:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement