తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?
అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ వారం విషయంలోకి వెళ్తే.. తాళి కట్టు శుభవేళ.. అంతా మంచే జరగాలని కోరుకుంటాం. వధూవరులను ఆశీర్వదిస్తాం. అంతా మంగళప్రదంగా జరగాలని.. కలకాలం కొత్త జంట చల్లగా ఉండాలని కోరుకుంటాం. పెళ్లి సందర్భంలో వధూవరులకు వచ్చే బహుమతులపై పన్ను భారం లేదు. అటువంటి వాటిని ఆదాయంగా పరిగణించరు. ఇప్పుడు ముందు రిసెప్షన్.. తర్వాత పెళ్లి... కాబోయే జంట పందిరిలో నిలబడటం.. మిగతా అందరూ లైన్లో వెళ్లి, వారికి బహుమతులివ్వడం.. తాళి కట్టిన తర్వాత కూడా కొందరు ఇస్తారు. ఏది ఏమైనా సందర్భం ‘పెళ్లి’ ఒక రోజు అటూ ఇటూ.. పెళ్లి పేరు చెప్పి ఎప్పుడు ఇచ్చినా ఏ ఇబ్బందీ లేదు.ఎటువంటి బహుమతులు ఇవ్వొచ్చు..నగదు ఇవ్వొచ్చు. దగ్గరి బంధువైతే ఎటువంటి ఆంక్షలు లేవు. బీరకాయ .. బెండకాయ సంబంధం కాదండి. బాదరాయణ సంబంధమూ కాదు. చట్టంలో పొందుపర్చిన నిర్వచనాన్ని గుర్తు పెట్టుకోండి. అలా అని రూ.2,00,000 దాటకండి. పేటీఎంలు, గూగుల్ పేమెంట్లు, చెక్కులు, డీడీలు, ఆర్టీజీఎస్, బదిలీలు, నగ, నట్రా, వెండి, బంగారం, ఆభరణాలు, కుక్కర్లు, వంట సామగ్రి, టీవీలు, ఫ్రిజ్జులు, భూములు, ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, స్థిరాస్తి, షేర్లు, బాండ్లు.. ఎలాగైనా మీ ప్రేమ, అభిమానాన్ని ప్రకటించుకోండి. పుచ్చుకున్న వారికి ఆదాయంగా పరిగణించరు. పన్నుభారం పడదు. పన్ను చెల్లించనక్కర్లేదు. అయితే, కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.వధూవరులకు వచ్చే వాటిని ఆదాయంగా పరిగణించరు.అత్తగారి లాంఛనం, ఆడపడుచు కట్నం మొదలైన వాటి మీద ఎటువంటి మినహాయింపు లేదు. కొన్ని పెళ్లిళ్లలో ఈ లాంఛనాలు భారీగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త.పూర్వకాలంలో పురోహితుడు నలుగురికి వినపడేలా అరిచేవారు. ఫలానా వారింత కట్నం అని.. కొంత మంది తమ పేరు నలుగురికి వినబడేలా చదివించుకునే వారు.ఇప్పుడు బాహాటంగా చదివింపులు లేవు. కవర్లో ఎంతో కొంత పెట్టి.. అది వారి చేతిలో పెట్టి, ఫొటోగ్రాఫర్ వైపు మొగం చూపెట్టి.. భోజనం దిశగా అడుగెట్టి.. ఇంటి దారి పట్టి.. వెళ్లిపోతున్నారు.ఇవి చిన్న మొత్తాలయితేనేం.. అధిక విలువగలవైతేనేం.. పంతులు గారికి ఒక వెయ్యి నూటపదహార్లు ఇచ్చి ఒక పుస్తకం.. పెళ్లి పుస్తకం తెరిపించండి.ఆ పుస్తకానికి పసుపు, కుంకుమ బాగా దట్టించండి. తారీఖు, టైం వేసి.. అందరి పేర్లూ రాయండి. పింకీ, సుబ్బు, పక్కింటి ఆంటీ అని కాకుండా వీలైతే పూర్తి పేరు రాయండి. అలాగే ఫోన్ పేమెంట్లు, గూగుల్ పేమెంట్లు, బ్యాంకులో జమలు, ప్రత్యేక జాబితా రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లో ఈ ‘జవాబు’ను హైలైట్ చేయండి. మీరు మీ పెళ్లి పుస్తకంలో వారి పేరు, వీలైతే, సెల్ నంబరు రాయండి. బ్యాంకు స్టేట్మెంట్లు భద్రపరచండి.ఇదీ చదవండి: ‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదననగదు చదివింపులను వీలైతే బ్యాంకులో జమ చేయండి. ఆ పేయింగ్ స్లిప్‌ను మీ పుస్తకంలో అతికించండి.ఇలా రాయటం వల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి మున్ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంట్ వారికి ‘సోర్స్’ వివరణ రెడీగా ఉంటుంది. రెండోది మీరు అటువంటి వారికి కట్నం ఇచ్చేటప్పుడు ఇదొక కొలబద్దగా ఉంటుంది.నగదు ఖర్చుపెట్టే అవసరం అయితే.. దేని నిమిత్తం ఖర్చు పెట్టారో రాయండి.భారీ కంచాలు, ప్లేట్లు, సీనరీలు, దేవుడి బొమ్మలు మొదలైనవి రాయకపోయినా ‘విలువైనవి’ అనిపించిన వస్తువుల జాబితా రాయండి.స్థిరాస్తులు మొదలైన అన్ని కాగితాలు తీసుకోండి. బదిలీ పత్రాలు తీసుకోండి. మరీ చాదస్తం అని కొట్టిపడేయకండి. దేనికైనా దస్త్రం కావాలి. అదీ మనమే సమకూర్చుకోవాలి. సకాలంలో సర్దుకోండి.-కే.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి-కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు