మత్స్యకారుని ప్రాణం తీసిన ‘వల’
చెన్నూరు : ‘వలతో చేపలు పట్టి జీవించే మత్స్యకారుని అదే వల ప్రాణాలు తీసిన సంఘటన చెన్నూరు వద్ద పెన్నానదిలో మంగళవారం చోటు చేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బెస్తకాలనీకి చెందిన జింకా సంటెయ్య(65) మత్సకారుడు. ఐదు దశాబ్దాలుగా చేపలు పట్టి జీవిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు స్థానిక పెన్నానది వద్దకు వెళ్లిన సంటెయ్య వల వేసి చేపలు పడుతున్నాడు. చేపలు పడక పోవడంతో కాస్త లోపలికి వెళ్లి వలవేశాడు. వల తీస్తుండగా నీటి ఉధృతికి నిలవలేక పక్కకు వచ్చేందుకు ప్రయత్నించాడు. ఇంతలో తాను విసిరిన వల కాళ్లకు చుట్టుకుని నీటిలోకి కొట్టుకుపోయాడు. కాళ్లు ఆడివ్వడానికి వీలు లేక పోవడంతో ఈత బాగా వచ్చే సంటెయ్య స్థానిక మత్స్యకారులు చూస్తుండగానే మునిగిపోయాడు. స్థానికులు మృత దేహాన్ని బయటకు తీశారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్ట కోసం కడప రిమ్స్‌కు తరలించారు.