breaking news
Ginning mills
-
ఈసారీ వి'పత్తే'..!
సాక్షి, హైదరాబాద్: పత్తికి కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధర రైతుకు దక్కకుండా చేసేందుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా రైతులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని పత్తిని విక్రయించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’యాప్ను వెనక్కు తీసుకొనేలా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ వానాకాలం సీజన్లో పత్తి విక్రయాలకు సంబంధించి జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గురువారంతో సీసీఐ పిలిచిన పత్తి టెండర్లకు చివరి తేదీ కాగా, బుధవారం వరకు ఏ మిల్లూ టెండర్లలో పాల్గొనక పోవడం గమనార్హం. గురువారం జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొంటేనే అక్టోబర్ నుంచి మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది. పెరిగిన పత్తి సాగు రాష్ట్రంలో ఈసారి 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పత్తి మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు. పత్తికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.590 పెంచింది. దీంతో నాణ్యమైన పత్తి (లాంగ్ స్టేబుల్) మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110లకు చేరింది. రెండో శ్రేణి పత్తి (మీడియం స్టేబుల్) మద్దతు ధర రూ.7,710గా ఉంది. కానీ, సీసీఐ ద్వారా మద్దతు ధరతో జరిగే పత్తి కొనుగోళ్లకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే మార్కెటింగ్ శాఖ ఈసారి బహిరంగ మార్కెట్లో పత్తి ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు సగటు ధరను 4,255గా నిర్ణయించారు. ఇక్కడ గరిష్ట ధర క్వింటాలుకు రూ.7,251 కాగా, కనిష్ట ధర రూ.3,711. ఈ నేపథ్యంలో రైతులు సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు విక్రయిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ఇక్కడే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చక్రం తిప్పుతున్నాయి. దళారుల ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, సీసీఐ ఇచ్చే మద్దతు ధరను దక్కించుకునే విధానానికి కొత్త నిబంధనలు అడ్డు తగులుతుండడంతో వాటిని ఎత్తి వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. టెండర్లకు దూరంగా జిన్నింగ్ మిల్లులు రాష్ట్రంలో 354 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో 341 మిల్లులు సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు అర్హత సాధించాయి. సీసీఐ ద్వారా రైతుల నుంచి పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసేందుకు ఈ మిల్లులు టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. గత సంవత్సరం 310 మిల్లులు టెండర్లలో పాల్గొన్నాయి. కానీ, ఈసారి టెండర్లలో పాల్గొనేందుకు మిల్లర్లు ఆసక్తి చూపటంలేదు. అందుకు సీసీఐ నిబంధనలే కారణమని అంటున్నారు. రైతులు వారం ముందే ‘కపాస్ కిసాన్’లో స్లాట్ బుక్ చేసుకోవడం, జిల్లాలో పత్తి సాగు, క్రాప్ బుకింగ్ ఆధారంగా ఒక రైతు ఎన్ని క్వింటాళ్ల పత్తిని విక్రయించాలో ముందే నిర్ణయించడం, 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేయటం, ఏ జిల్లాలో పండిన పత్తిని ఆ జిల్లాలోనే విక్రయించడం వంటి నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు ఈసారి పత్తి సేకరణ పట్ల ఆసక్తి చూపటంలేదు. తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మి.. గత సంవత్సరం రాష్ట్రంలో పత్తి విక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ, మార్కెటింగ్ శాఖతో జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇందుకోసం రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈసారి కపస్ కిసాన్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐ నిర్ణయించింది. అయితే, ఈసారి యాప్ ద్వారా కొనుగోళ్లను నిలిపివేయాలని సీసీఐని జిన్నింగ్ మిల్లర్లు కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి సీసీఐకి లేఖ ఇప్పించాయి. రైతులకు నష్టం కలగనీయం పత్తి కొనుగోళ్ల విషయంలో గతంలో జరిగిన అవకతవకలు ఈసారి లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. దళారులు, వ్యాపారుల జోక్యం లేకుండా నేరుగా రైతులే పత్తిని మద్దతు ధరకు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించాం. మద్దతు ధరకే పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరుతున్నాం. దళారుల మాటలు నమ్మి, తక్కువ ధరకు పత్తిని విక్రయించుకోవద్దు. – తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ మంత్రి తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మి..గత సంవత్సరం రాష్ట్రంలో పత్తి విక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ, మార్కెటింగ్ శాఖతో జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇందుకోసం రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐ నిర్ణయించింది. అయితే, ఈసారి యాప్ ద్వారా కొనుగోళ్లను నిలిపివేయాలని సీసీఐని జిన్నింగ్ మిల్లర్లు కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి సీసీఐకి లేఖ ఇప్పించాయి. -
పత్తి ధర చిత్తు
ఖమ్మం వ్యవసాయం: పత్తి ధర పతనమవుతోంది. 20 రోజుల క్రితం రూ. 5 వేల వరకు పలికిన రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తి రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు మాత్రమే పలుకుతోంది. పంట సీజన్ కానప్పటికీ ధర పడిపోవటం చర్చనీయాంశంగా మారింది. సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చే సమయంలో ధర బాగుటుందని భావించి రైతులు నిల్వ ఉంచిన పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పంటలకు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. కొత్త పత్తి అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉండటంతో నిల్వ ఉంచిన పాత పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. ఇక్కడి పత్తిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల్లోని జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో పత్తికి అంతగా డిమాండ్ లేకపోవటంతో ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పత్తి వచ్చే సీజన్ దగ్గరలోనే ఉండటంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు సరుకు కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపటం లేదని అంటున్నారు. క్వింటాల్కు రూ.1500 వరకు తగ్గింపు.. 20 రోజుల క్రితం క్వింటాల్ పత్తి రూ.4,900 వరకు పలికింది. రోజుకు కొంత చొప్పున తగ్గుతూ వచ్చింది. సోమవారం జెండా పాట రూ.4,400 పలికింది. అయితే వ్యాపారులు ఆ రేటు పెట్టలేదు. జెండాపాటకు ఖరీదుదారులు ముందుకు రాలేదు. మార్కెట్ అధికారులు వ్యాపారులను పిలిపించి జెండాపాట నిర్వహించారు. సరకుకు డిమాండ్ లేదని, ధర పెట్టలేమని వ్యాపారులు అధికారులకు చెప్పారు. రూ.4,400 జెండాపాట పలుకగా మార్కెట్లో రైతులు తెచ్చిన సరకులో అధికభాగానికి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకే ధర పెట్టారు. బాగా నాణ్యంగా ఉన్న కొంత సరుకుకు రూ.4 వేల వరకు ధర పడింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దాదాపు 10 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అన్సీజన్లో ధర అధికంగా ఉంటుందని పంటను తెస్తే తీరా ఇక్కడికి వచ్చాక ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.