సామాజిక మార్పుతోనే బాలికా సంరక్షణ
– ఆడపిల్లలను పుడితేనే వదిలేస్తుండటం దారుణం
– వివక్షతను అరికట్టడంలో మీడియా పాత్ర అభినందనీయం
– రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి
కర్నూలు (అగ్రికల్చర్): సామాజిక మార్పుతోనే బాలికా సంరక్షణ సాధ్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. గురువారం కర్నూలులోని స్టేట్ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, లైంగిక వేధింపులను మహిళా కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. వీటిపై ఎప్పటికపుడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత డీఎస్పీలతో మాట్లాడుతూ తగిన చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. అనాథలుగా మారుతున్న బాలికల విషయంలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. . ఆడపిల్ల పుట్టిందని వదిలేసి వెళ్లిపోతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయని, ఇలాంటివి గుంటూరులో మరీ ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి వలసలు ఎక్కువగా ఉంటున్నాయని, పిల్లలను కూడా వెంట తీసుకెళ్తున్నాని ఇందువల్ల వారు బాలకార్మికులుగా మారుతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా ఆరు నెలల కిత్రం బాధ్యతలు చేపట్టానని ఈ వ్యవధిలోని మహిళా కమిషన్‌కు 470 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జిల్లా ఎస్పీ ఆకె రవికష్ణ మాట్లాడుతూ చిన్న పిల్లలను వదిలేస్తున్న సంఘటనులు ఎక్కువగా జరుగుతుండటంతో జిల్లా పోలీసు అధికారులను అలర్ట్ చేసినట్లు తెలిపారు. మహిళల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఆర్ డీడీ శారద, జిల్లా బాలనేరస్తుల పర్యవేక్షణ అధికారి రామసుబ్బారెడ్డి, మహిళా కమిషన్ డైరెక్టర్ సామేజ్ తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ కార్యక్రమాలపై సమీక్ష:
మధ్యాహ్నం ఐసీడీఎస్ కార్యక్రమాల అమలుపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గహ హింస చట్టం, వన్ స్టాప్ సెంటర్ల ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్ స్కీమ్, చిల్డ్రన్స్ హోమ్‌ల నిర్వహణ, శిశుగహలోని చిన్నారుల సంక్షేమం తదితర కార్యక్రమాలను సమీక్షించారు. చిల్డ్రన్ హోమ్‌లు, శిశుగహలను మరింత బలోపేతం చేయాలన్నాలని చైర్ పర్సన్ అన్నారు. కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి, సీడీపీఓలు, స్వయంసహాక సంఘాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
బుగ్గతండా బాలికలకు పరామర్శా:
పత్తికొండ మండలం బుగ్గతండాకు చెందిన బనావత్ రమణమ్మ కామెర్లతో మతి చెందడం, తండ్రి రాంబాబు నాయక్ తాగుడుకు బానిస కావడంతో వారి సంతానమైన మల్లిక, శశిరేఖ, ఇందు, లోకేశ్వరీ, సింధులు దిక్కులేని వారుగా మిగిలారు. వీరి దుస్థితిపై పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు రావడంతో దాతలు స్పందించి చిన్నారి బాలికలకు చేయాత నిచ్చారు. జిల్లా యంత్రాంగం స్పందించి సింధూ మినహా నలుగురిని కస్తూరిబా పాఠశాలలో చేర్పించింది. కర్నూలుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఐదుగురు చిన్నారులను పరామర్శించారు. వారికి దుస్తులు అందచేశారు. అనాథలుగా మిగిలిన చిన్నారులను చేసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని శారదనికేతన్ విద్యాసంస్థ ఐదుగురు ఆడపిల్లలను ఇంటర్ వరకు చదివించేందుకు, సెలవుల్లో సంరక్షించేందుకు ముందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఐదుగురు చిన్నారులను పెద్దపాడు శిశుగహానికి తరలించేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చిందన్నారు. పిల్లలను ఇతర జిల్లాలకు పంపవద్దని చిన్నారుల మేనమామ, చిన్నాయన కోరడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథలుగా ఉన్నపుడు లేని ప్రేమ ఇపుడు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పిల్లల భవిష్యత్తును మేము చూసుకుంటామని తెలిపారు.