వేటకు వెళ్లి.. ప్రియురాలిని కాల్చేసిన ప్రియుడు
ఓ అమ్మడు తన ప్రియుడితో కలిసి వేటకు వెళ్లింది. అక్కడ ఆమె పొదలచాటుగా నక్కి వెళ్లేసరికి.. లేడిపిల్ల దొరికిందనకుంటూ ఆ ప్రియుడు తన తుపాకి గురిపెట్టి కాల్చాడు. అంతే, బుల్లెట్ కాస్తా అమ్మడి కాల్లోకి దిగిపోయింది!! ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ప్రియురాలు ఆడ్రే మేయో (24)ను తుపాకితో కాల్చినందుకు జార్జియాకు చెందిన మాథ్యూ టైలర్ వెబ్ (23)పై పోలీసులు కేసు నమోదు చేశారు.
వీళ్లిద్దరూ కలిసి వెబ్ ఇంటి డాబా మీదకు వెళ్లారు. అక్కడకు సమీపంలో ఉన్న అడవిలో కొన్ని లేళ్లు వెళ్తున్నాయి. దాంతో వాటిని వేటాడాలని మాథ్యూ అనుకున్నాడు. ముందుగా ఆమె ఇంటివద్దే ఉండిపోదామనుకున్నా, తర్వాత తానూ వస్తానంది. ఇంతలో పొదలమాటున ఏదో సవ్వడి వినిపించడంతో మాథ్యూ తన తుపాకి తీసుకుని కాల్చాడు. కానీ లేడిపిల్ల అరుపులకు బదులు తన స్నేహితురాలి కేక వినిపించింది. వెంటనే అక్కడకు వెళ్లి తన జాకెట్ తీసి కాలి గాయం చుట్టూ కట్టాడు. మేయో అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. అయితే, రోడ్డుకు 150 అడుగుల దూరంలో తుపాకితో కాల్పులు జరిపినందుకు గాను మాథ్యూపై కేసు నమోదుచేశారు.