ఐసీఎస్ఈలో బాలికలే టాప్
న్యూఢిల్లీ: కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) పన్నెండు, పదో తరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలు దుమ్మురేపారు. రెండు తరగతుల్లో టాప ర్యాంకులు దక్కించుకున్నారు. పన్నెండు, పదో తరగతి ఫలితాలను ఐసీఎస్ఈ సోమవారం విడుదల చేసింది. మొత్తంగా ట్వల్త్‌లో 96.47 శాతం, టెన్త్‌లో 98.53 శాతం ఉత్తీర్ణులయ్యారు. పన్నెండో తరగతిలో 97.73 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవ్వగా, బాలుర శాతం 95.39. మొత్తం 50 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షలో 16 భారతీయ భాషలు, 5 విదేశీ భాషలు, ఒక లలితకళలకు సంబంధించిన పేపర్లు ఉంటాయి.
పన్నెండు, పదో తరగతి ఫలితాల్లో దక్షిణాది విద్యార్థుల ఆధిక్యం స్పష్టంగా కనబడింది. 10వ తరగతిలో ముస్కాన్ అబ్దుల్లా(పుణే), అశ్విన్‌రావు(బెంగళూరు) 99.4 శాతం ఉత్తీర్ణతతో సంయుక్తంగా టాపర్స్‌గా నిలిచారు. 12వ తరగతిలో కోల్‌కతా విద్యార్థిని అనన్య మైటీ(99.50) టాపర్‌గా నిలిచింది.