అత్యాచారాల నియంత్రణకు ‘డ్రస్కోడ్’
ప్రభుత్వానికి బళ్లారి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడి సూచన
బళ్లారి : రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలికల డ్రస్‌కోడ్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని బళ్లారి జిల్లా జేడీఎస్ అధ్యక్షుడు కుడితిని శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ను ఆయన బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాలల్లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూటికి 90 శాతం విద్యార్థినిలకు మోకాళ్ల పైకి ఉన్న డ్రస్‌లను యూనిఫాంగా అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి డ్రస్‌లతో బెంచీలపై కూర్చొన్నప్పుడు విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థినిలపై అత్యాచారాలు నియంత్రణకు తక్షణమే డ్రస్కోడ్ మార్చాలని అన్నారు. 1 నుంచి కాలేజీ వరకూ విద్యనభ్యసించేందుకు వెళ్లే అమ్మాయిలు విధిగా చూడీదార్, చున్నీ వేసుకుని వెళ్లేలా డ్రస్కోడ్ అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వినతిపత్రం సమర్పించిన వారిలో జేడీఎస్ నాయకులు తాయణ్ణ, సోమలింగనగౌడ తదితరులు ఉన్నారు.