బాల్యానికి బరువు బాధ్యతలు
► ఒకే గ్రామంలో ఇద్దరు బాలికలకు నిశ్చితార్థం
► ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలకే కారణం
► తల్లిదండ్రులకు అధికారుల కౌన్సెలింగ్
నవాబుపేట: ముక్కుపచ్చలారని బాలికలకు బాల్యంలోనే బాధ్యతలను అంటగడుతున్నారు. నిరక్షరాస్యత, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అవరోధాలు.. వంటి సమస్యలు పసితనాన్ని పెళ్లిపీటలు ఎక్కిస్తున్నాయి. నిశ్చితార్థం జరిగిన ఇద్దరు బాలికలు తమకు పెళ్లివద్దని.. చదువుకుంటామని అధికారుల ఎదుట కన్నీరుపెట్టడం పలువురిని కలిచివేసింది. ఈ విషయం మంగళవారం పల్లెవికాసంలో వెలుగుచూసింది. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ బాలిక నవాబ్‌పేట జెడ్పీ ఉన్నతపాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వచ్చేనెల 1న ఆమెకు తల్లి, బంధువులు కలిసి కోయిల్‌కొండ మండల కేంద్రానికి చెందిన రఘుతో పెళ్లి కుదిర్చారు. తల్లి మాట కాదనలేక.. పెళ్లి వద్దని అడ్డుచెప్పలేక తలదించుకుని తాళిబొట్టు కట్టించుకోవాలనుకుంది. పల్లె వికాసం కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన అధికారుల బృందానికి ఈ విషయం తెలిసింది.
సదరు బాలిక వద్దకు వెళ్లి అసలు విషయాన్ని ఆరాతీశారు. ‘సర్.. నాకు చదువుకోవాలని ఉంది.. మా అమ్మ, బంధువులు నాకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారికి ఏమీ చెప్పలేక పోయా..’ అని కన్నీరుమున్నీరైంది. నీకు పెళ్లి ఇష్టమేనా.. అని అడిగేసరికి ఆమె నుంచి దుఃఖం తన్నుకొచ్చింది. మండల ప్రత్యేకాధికారి సురేష్ గౌతం, తహసీల్దార్ చెన్నకిష్టప్ప బాలిక తల్లి, బంధువులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజర్‌గా మారిన తరువాతే పెళ్లి జరిపించాలని నచ్చజె ప్పారు.
అదే గ్రామంలో మరో బాలిక నవాబుపేట ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. తల్లి ఈనెల 28న ఆమెకు పెళ్లి నిశ్చయించింది. వివాహ ఏర్పాట్లు కూడా చ కచకా సాగుతున్నాయి. గ్రామంలోకి వెళ్లిన అధికారులకు ఈ విషయం తెలియడంతో తల్లి, ఇతర బంధువులకు అవగాహన కల్పించారు. మైన ర్లకు పెళ్లిచేయడం చట్టరీత్యానేరమని చెప్పారు. ఇదిలాఉండగా, తమ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతోనే పెళ్లిళ్లు చేయాలని నిశ్చయించామని ఆ బాలికల తల్లులు వాపోయారు. పేదరికమే కారణమంటున్నారు.