లోకసభ ఫలితాలపై శివమొగ్గలో.. ఊపందుకున్న బెట్టింగ్
శివమొగ్గ, న్యూస్‌లైన్ : లోకసభ ఎన్నికల ఫలితాలపై శివమొగ్గలో బెట్టింగ్ ఊపందుకుంది. బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప, జేడీఎస్ అభ్యర్థి గీతాశివరాజ్‌కుమార్‌పైనే పెద్ద మొత్తంలో పందెంకాస్తున్నారు. ఇప్పటికే వీరిపై రూ. కోట్లలోనే బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. యడ్యూరప్పకు ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆయన గెలిస్తే పార్టీలో మళ్లీ కింగ్ మేకర్ కానున్నారు. ఓటమి పాలైతే మాత్రం అతని రాజకీయ భవిష్యత్ కనుమరుగు కావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
16న నిషేదాజ్ఞలు : కలెక్టర్
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 16న జరగనుండడంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేదాజ్ఞలు విధించినట్లు జిల్లా కలెక్టర్ విపుల్ బన్సల్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు వీడియో చిత్రీకరణ కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎస్ఆర్ నాగప్ప శెట్టి స్మారక జాతీయ సైన్స్ కాలేజీలో శివమొగ్గ గ్రామాంతర, శికారిపుర, సాగర, బైందూరు నియోజకవర్గాలు, నేషనల్ డిగ్రీ కాలేజీ తరగతి గదుల్లో సొరబ, శివమొగ్గ, తీర్థహళ్లి, భద్రావతి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. శివమొగ్గ, బైందూరు నియోజకవర్గాలకు ఒకే కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు మూడు టేబుల్, ఎన్నికల అధికారుల టేబుల్లో ఫలితాలు క్రోడీకరణకు ఒక టేబుల్ కేటాయించినట్లు చెప్పారు.
లెక్కింపు ప్రక్రియలో 150 మంది, వారికి సహాయకులుగా మరో 150 మంది, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులకు తొమ్మిది మంది, ట్యాబులేషన్‌కు 48 మందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా 160 మంది నౌకర్లు హాజరు కానున్నారని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించినట్లు తెలిపారు. 16న మద్యం అమ్మకాలు, కౌంటింగ్ కేంద్రాలు 200 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించినట్లు చెప్పారు.