డ్రెయినేజీలో కొట్టుకుపోయిన బాలిక
సోమవారం రాత్రి బెంగళూరులో కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై నడుస్తున్న ఓ చిన్నారి డ్రెయినేజీలో కొట్టుకుని పోయింది. గుంతలమయమైన రోడ్లలో నిలిచిన నీటిపై నడుస్తున్న చిన్నారి మ్యాన్‌హోల్ ప్రమాదవశాత్తు పడిపోయింది. బాలిక కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
బెంగళూరు : సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రోడ్డుపై నడుస్తున్న ఓ చిన్నారి డ్రెయినేజీలో కొట్టుకుని పోయిన సంఘటన నగరంలో చోటు చేసుకుంది. గుంతలమయమైన రోడ్లలో నిలిచిన నీటిపై నడుస్తూ అది మ్యాన్‌హోల్ అని తెలియక ఓ చిన్నారి తన అత్త చేయి పట్టుకుని వస్తూ ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడి పోయింది. తమిళనాడుకు చెందిన గీతాలక్ష్మి (9) అనే బాలిక డ్రెయినేజీలో కొట్టుకుని పోయింది. ఇక్కడి మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు... తమిళనాడుకు చెందిన గీతా లక్ష్మి (9) దసరా సెలవుల సందర్భంగా బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్డులో పుట్టేనహళ్లిలోని దొరస్వామిపాళ్యలో ఉన్న అత్త ఇంటికి వచ్చింది.
సోమవారం రాత్రి 7 గంటల సమయంలో అత్తతో కలిసి గీతా లక్ష్మి మైకో లేఔట్లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి అత్తతో కలిసి ఇంటికి బయలుదేరింది. అంతకు ముందే నగరంలో భారీ వర్షం కురిసింది. మార్గం మధ్యలో మైకోలేఔట్లోని పైహోటల్ ముందు భాగంలో అత్త చెయ్యి పట్టుకుని వస్తున్న గీత ఒక్కసారిగా మ్యాన్‌హోల్‌లో పడిపోయి కొట్టుకుపోయింది. అత్త లక్ష్మి గట్టిగా కేక వేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసిన ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని బాలిక కోసం గాలించారు. మంగళవారం ఉదయం వరకు బాలిక ఆచూకీ లభించలేదు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు వర్ణణాతీతం.