పోలీసుల పిల్లలు మరిన్ని విజయాలు సాధించాలి
ఏలూరు అర్బన్ : పోలీసుల పిల్లలు అన్ని రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, విజయాలను చూసి గర్వపడుతున్నానని జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ అన్నారు. డాక్టర్ టి.వెంకటేశ్వరరావు, టి.ప్రభాకరరావులు తమ తండ్రి జ్ఞాపకార్థం స్థానిక సురేష్ బహుగుణ పోలీస్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ప్రతిభ చూపిన వారికి ఏటా నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారు భాస్కర్భూషణ్ చేతులమీదుగా విద్యార్థులకు నగదు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల పిల్లలు మరింతగా శ్రమించి భవిష్యత్లో మరిన్ని విజయాలు నమోదు చేయాలని, పోలీస్ శాఖకు వన్నె తేవాలని ఆకాంక్షించారు. అందుకోసం అవసరమైన తోడ్పాటు అందించేందుకు తాను అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు. పిల్లల విజయంలో తోడ్పాటు అందించిన పాఠశాల ఆధ్యాపకులు, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్న పూర్వ విద్యార్థుల యోచన ఆదర్శనీయమన్నారు. ఆర్.కీర్తి (పదో తరగతి). కె.గణే ష్ (పదో∙తరగతి), కె.ఆంజనేయులు (ఇంటర్), ఎస్ఎల్సీ సాయికుమార్ (ఇంటర్)లకు రూ.10,000, జేవీ.శివకుమార్, బి.సౌజన్యలకు రూ.2,500 నగదు అందించారు. ఏఆర్ డీఎస్పీ బి.చంద్రశేఖర్, ఆర్ఐ ఎ.వెంకట్రావు పాల్గొన్నారు.