మాటల మాంత్రికులు నచ్చే కెరీర్..
క్రీడా వ్యాఖ్యానం టీవీలు విస్తృతంగా అందుబాటులోకి రాకముందు క్రికెట్ కామెంటరీని ట్రాన్సిస్టర్లలో వినడం చాలామందికి ఒక మధుర జ్ఞాపకం. ప్రతి బంతిని, పరుగును విశ్లేషిస్తూ, ఎప్పటికప్పుడు స్కోర్‌ను తెలియజేస్తూ వ్యాఖ్యాతలు మ్యాచ్‌ను కళ్లకు కట్టినట్టు చూపించేవారు. కామెంటేటర్లకు ఎందరో అభిమానులుండేవారు. మాటల మాంత్రికులు స్పోర్ట్స్ కామెంటరీని కెరీర్‌గా ఎంచుకుంటే నేడు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. స్పోర్ట్స్ చానళ్ల సంఖ్య పెరగడంతో కామెంటేటర్లకు డిమాండ్ పెరిగింది. కాబట్టి క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఇందులోకి ప్రవేశించొచ్చు.
గ్లామరస్ జాబ్: స్పోర్ట్ కామెంటరీ అనేది గ్లామరస్ జాబ్. కామెంటరీ బాక్సుల్లో కూర్చొని లైవ్ మ్యాచ్‌ను ఆసక్తికరంగా విశ్లేషించాల్సి ఉంటుంది. ఒకప్పుడు క్రికెట్‌కే పరిమితమైన వ్యాఖ్యానం ఇప్పుడు ఇతర క్రీడలకు కూడా పాకింది. స్పోర్ట్స్ చానళ్లలో అన్ని రకాల క్రీడలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. కామెంటేటర్లను తప్పనిసరిగా నియమిస్తున్నారు. వ్యాఖ్యాతలుగా సాధారణంగా క్రీడాకారులకే ప్రాధాన్యత ఉంటుంది. కానీ, హర్షా బోగ్లే, పద్మజీత్ షెరావత్ లాంటివారు క్రీడలతో సంబంధం లేకపోయినా కామెంటేటర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు.
కాబట్టి ప్రతిభాపాటవాలు ఉంటే ఇందులో సులువుగా రాణించొచ్చు. క్రీడా వ్యాఖ్యాతలకు స్పోర్ట్స్ చానళ్లు, ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశాలున్నాయి. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలోనూ కామెంటేటర్ల అవసరం ఉంటోంది. వ్యాఖ్యాతలకు నిత్యం పని దొరకదు. ఒక్కోసారి నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని పార్ట్‌టైమ్ కెరీర్‌గా ఎంచుకోవడం మంచిది. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే దీన్ని పూర్తిస్థాయి కెరీర్‌గా మార్చుకోవచ్చు.
కావాల్సిన నైపుణ్యాలు: స్పోర్ట్స్ కామెంటేటర్లకు ఆంగ్ల, హిందీ భాషలపై గట్టి పట్టు ఉండాలి. క్రీడలను ప్రేమించే గుణం అవసరం. క్రీడల నియమ నిబంధనలు, పాత రికార్డులపై పరిజ్ఞానం చాలా ముఖ్యం. సమయస్ఫూర్తిని ప్రదర్శించే నేర్పు, వినసొంపైన స్వరం, ఆకట్టుకొనే రూపం ఉండాలి.
అర్హతలు: క్రీడా రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నవారు రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతలుగా రాణిస్తున్నారు. జాతీయస్థాయి మాజీ క్రీడాకారులు కామెంటరీ బాక్సుల్లో దర్శనమిస్తున్నారు. కాబట్టి మొదట క్రీడల్లో పాల్గొని కామెంటేటర్‌గా మారొచ్చు. వ్యాఖ్యాతలకు సాధారణ విద్యార్హతలు ఉంటే సరిపోతుంది. మొదట స్పోర్ట్స్ చానళ్లలో పనిచేసి, అనుభవం పెంచుకున్న తర్వాత ఆలిండియా రేడియో, దూరదర్శన్‌లో అవకాశాలు పొందొచ్చు.
వేతనాలు: క్రీడా వ్యాఖ్యాతలకు ప్రతినెలా స్థిరమైన వేతనం అందకపోయినా పని దొరికినప్పుడు మాత్రం ఆర్జన భారీగానే ఉంటుంది. సాధారణ కామెంటేటర్ రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు సంపాదించుకోవచ్చు. ఈ రంగంలో అనుభవం పెంచుకుంటే రోజుకు రూ.25 వేలకు పైగానే అందుకోవచ్చు. ఎక్కువ రోజులు పనిచేస్తే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. అవకాశాలు ఎక్కడున్నాయో వెతుక్కోగల నైపుణ్యం ఉంటే డబ్బుకు లోటుండదు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
క్రీడలపై వ్యాఖ్యానం చెప్పడం తరగతి గదిలో నేర్చుకొనే విద్య కాదు. స్పోర్ట్స్ కామెంటరీపై మనదేశంలో ఎలాంటి కోర్సులు లేవు. ఆంగ్ల, హిందీ భాషలు నేర్చుకోవడంతోపాటు వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోర్సులు చదివినవారు ఈ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. ఈ కింది సంస్థల్లో ఆయా స్కిల్స్‌పై కోర్సులు ఉన్నాయి.
ఆర్.కె.ఫిలింస్ అండ్ మీడియా అకాడమీ-న్యూఢిల్లీ
వెబ్సైట్: http://rkfma.com/
డబ్లిన్ బిజినెస్ స్కూల్
వెబ్సైట్: www.dbs.ie