వాళ్లకు భయపడొద్దు... - రాశీ ఖన్నా
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీఖన్నా తెలుగువారిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘జిల్’ సినిమాలో గోపీచంద్ పక్కన మార్కులు కొట్టేసింది. ఇప్పుడు రామ్‌తో ‘శివమ్’లోనూ, రవితేజతో ‘బెంగాల్ టైగర్’లోనూ నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా కనిపించనుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న రాశీఖన్నాతో ‘సాక్షి’ చిట్‌చాట్...
♦ ఫస్ట్ ఓ జనరల్ క్వశ్చన్. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు చనిపోతున్నారు. ఈ సంఘటనల గురించి మీరు విన్నారా?
రిషితేశ్వరి గురించి విన్నాను. టీవీ చానల్స్‌లో న్యూస్ చూశాను. చాలా బాధ అనిపించింది. ర్యాగింగ్ అనే పేరు ఎత్తడానికి వీల్లేనంతగా కఠినమైన నిబంధనలు విధించాల్సిన బాధ్యత కళాశాలలదే. అలాగే, ఫ్రెషర్స్ భయపడకూడదు. యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ప్రతి కళాశాలలోనూ ఓ ఫోరమ్ ఉంటుంది. ఆ ఫోరమ్‌కి కంప్లయింట్ చేయాలి.
♦ ఆత్మహత్యే సమస్యకు పరిష్కారం అంటారా?
కానే కాదు. అది పిరికితనం. మనం లేకపోతే మనవాళ్లు ఏమైపోతారు? అని ఆలోచించాలి. ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చేసి మన దారి మనం చూసుకోవడం సరి కాదు. జీవితం ఎంతో విలువైనది.
♦ అత్యాచారం చేసేసి, ఆ తర్వాత అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయే అబ్బాయిలను ఊరికే వదలొచ్చా? ఇదే విషయమై సుప్రీం కోర్టు ‘పెళ్లి చేసుకున్నా.. దోషి శిక్ష అనుభవించాల్సిందే’ అని తీర్పు ఇచ్చింది.. మీరేమంటారు?
ఈ తీర్పుని పూర్తిగా ఆమోదిస్తున్నాను. ‘ఎ రేపిస్ట్ ఈజ్ ఎ రేపిస్ట్’. అత్యాచారం చేసినవాణ్ణిచ్చి పెళ్లి చేస్తే అంతకన్నా ఘోరమైన పరిష్కారం మరోటి ఉండదు. ఆ అమ్మాయిని కూపంలోకి నెట్టినట్లే.
♦ సినిమాల విషయానికొస్తే... దాదాపు హీరోయిన్లే హీరోల చుట్టూ తిరుగుతారు. సో.. అమ్మాయిలను తక్కువ చేస్తున్నారేమో అంటే మీరు ఒప్పుకుంటారా?
ఆడవాళ్లు ఆర్ట్లాంటి వాళ్లు. వాళ్ల అందాన్ని ఆవిష్కరించడం తప్పు కాదు. కానీ అభ్యంతరకరంగా చూపించడం తప్పు. అలాగే ప్రతి సినిమాలోనూ అమ్మాయిలు హీరోల చుట్టూ తిరుగుతారంటే నేనొప్పుకోను. పరిస్థితుల్లో మార్పొస్తోంది. సో.. కథానాయికలను గ్లామర్ డాల్స్‌లా మాత్రమే చూసే పరిస్థితి పోతుంది.
♦ పదే పదే ఓ అబ్బాయి వెంటపడితే కనికరించి ఐ లవ్ యూ చెప్పాలనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా?
(నవ్వుతూ) లక్కీగా అలా ఇబ్బందిపడిపోయే సందర్భాలేవీ రాలేదు.
♦ ఇవాళ కథానాయికలు ముప్పై ఏళ్ల తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ మారుతున్నారు లేకపోతే అవకాశాల్లేకుండా మిగిలిపోతున్నారు. కథానాయికల కెరీర్‌కి లాంగ్విటీ తక్కువనే విషయంపై మీ అభిప్రాయం?
ఒక్కసారి గ్లామర్ డాల్ ఇమేజ్ నుంచి బయటపడి పూర్తిగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తే అప్పుడు హీరోల్లా హీరోయిన్స్ కెరీర్‌కి కూడా లాంగ్విటీ ఉంటుంది. కథల్లో మార్పు రావాలి. అప్పుడు మొత్తం ఫిలిం కమ్యూనిటీలో మంచి మార్పొస్తుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఈ మార్పు మొదలైంది. ఇక్కడ కూడా ఆ మార్పు వస్తుందనే నమ్మకం ఉంది.
♦ మీరు ఎవరి ముందు తలవంచాలనుకుంటారు.. అమ్మ, నాన్న, గురువు, దైవం...?
నన్ను ఇన్‌స్పయిర్ చేసే వ్యక్తుల ముందు నేను తలవంచడానికి వెనకాడను. అలాగే ఎవరి దగ్గరైనా మంచి విషయాలు నేర్చుకునే వీలు ఉంటే వాళ్లకు తల వంచుతాను. నాకన్నా చిన్నవాళ్లయినా సరే బెండ్ కావడానికి రెడీ అవుతాను.
♦ ఇప్పుడు మీరు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాబట్టి కోట్లు సంపాదించే అవకాశం ఉంది. మరి.. పేదవాళ్లను చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
విధి నిర్ణయం మేరకు అందరూ పుడతారు. హార్డ్ వర్క్‌తో దాన్ని మార్చుకోవచ్చు. స్వతహాగా నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా హార్డ్‌వర్కే నన్నీ స్థాయికి తీసుకొచ్చింది. పేదవాళ్లని చూసినప్పుడు జాలి కలుగుతుంది. ధనవంతులందరూ తమ సంపాదనలో ఐదు శాతం డొనేట్ చేస్తే చాలు.. పేదరికం అనే మాట వినపడదు... మెల్ల్ల మెల్ల్లగా పేదవాళ్లు కనపడరు.
♦ మరి.. మీ సంగతేంటి? సామాజిక సేవ చేస్తుంటారా?
తప్పకుండా. కానీ, దాని గురించి చెప్పను. ఎందుకంటే, మనం కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదని మా అమ్మ అంటుంది.
♦ అది సరే.. తెలుగు భాష తెలియకుండా ఎలా మ్యానేజ్ చేస్తున్నారు?
నాకు తెలుగు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? భాష తెలియకుండా నటించడం ఈజీ కాదు. అందుకే నా మొదటి సినిమా అప్పుడే నేర్చుకున్నాను. తెలుగు మాట్లాడతాను కానీ, బోల్డన్ని తప్పులొస్తాయి. కాకపోతే బాగా అర్థమవుతుంది. అందుకని, కష్టంగా లేదు.
♦ హిందీలో మీ ఫేవరెట్ హీరో?
రణ్‌బీర్ కపూర్..
♦ తెలుగు ఏ దర్శకుడితో సినిమా చేయాలని ఉంది?
రాజమౌళి.
♦ మీరు చేయబోయే పాత్రలు...
త్వరలో మీరు నన్ను పోలీసాఫీసర్‌గా చూడబోతున్నారు. ఓ చిత్రంలో ఆ పాత్ర చేస్తున్నా. నాకెప్పుడూ నాన్-గ్లామరస్ రోల్స్ అంటే ఇష్టం. ఒకవేళ గ్లామరస్ రోల్ అయితే అందులో విషయం ఉండాలి. నేను చేసే గ్లామరస్ రోల్స్‌లో విషయం ఉంటుంది. నా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, ప్రేక్షకుల ప్రేమాభి మానాలు కూడా నా సక్సెస్‌కి కారణం.
- డి.జి. భవాని