అవసరమైతే అందవిహీనంగా కనిపిస్తా!
అవసరమైతే అందవిహీనంగా కనిపిస్తా!
Published Sat, Feb 8 2014 11:48 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM
పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంటారు తమన్నా. ఈ మెరుపు తీగ అందం చూడటానికి రెండు కళ్లూ చాలవని అబ్బాయిలంటుంటారు. ఆ అభినందనకు మురిసిపోతూనే... ‘నేను అందవిహీనంగా కనిపించినా చూడ్డానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ముందుగా ఓ హింట్ ఇచ్చేస్తున్నారు తమన్నా. ఇప్పటివరకు దాదాపు గ్లామరస్ రోల్స్ చేసిన తమన్నాకు... పాత్ర డిమాండ్ చేస్తే డీ గ్లామరైజ్డ్‌గా కూడా కనిపించాలని ఉందట. ఈ విషయాన్నే ఆమె చూచాయగా సెలవిచ్చారు. దాదాపు ప్రతి సినిమాలోనూ హీరోలే డామినేట్ చేస్తారు కదా... అప్పుడు ఎలా అనిపిస్తుంది? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘అందులో వాస్తవం ఉంది. అయితే... ఓ సినిమాకి హీరోలు ఎంత ముఖ్యమో హీరోయిన్లూ అంతే ముఖ్యం.
హీరోయిన్లు లేని సినిమాలను ఊహించలేం కదా! హీరోల పాత్రలతో పోల్చితే మా పాత్ర నిడివి తక్కువగా ఉండొచ్చేమో. కానీ, ఆ కాస్త సమయమే సినిమాకు కళ కూడా. ఇక నా విషయానికొస్తే.. పాత్ర నిడివి ఎంత? అని ఎప్పుడూ నేను ఆలోచించలేదు. తెరపై కనిపించే తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తా’’ అని చెప్పారు. ప్రస్తుతం తెలుగులో రెండు, హిందీలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తమన్నా. తమిళంలో కూడా సినిమాలు అంగీకరించారట. కోట్లు సంపాదిస్తున్నారు కదా.. బాగా ఖర్చు పెడతారా? అని తమన్నాని అడిగితే -‘‘డబ్బుని మంచినీళ్లలా ఖర్చుపెట్టడం నాకిష్టం ఉండదు. నాక్కావల్సినవి మాత్రమే కొనుక్కుంటా. అనవసర ఆడంబరాలకు పోను’’ అన్నారు.
Advertisement
Advertisement