ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆహార ఉత్పత్తుల ధరలు
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తుల ధరలు అక్టోబర్‌లో పెరిగాయి. వరుసగా ఐదు నెలల పాటు తగ్గిన ధరలు మళ్లీ అక్టోబర్‌లో పైకి ఎగసినట్లు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆహార వ్యవసాయ సంఘం (ఎఫ్ఏఓ) పేర్కొంది. ఎఫ్ఏఓ ధరల సూచీలో చక్కెర ధరల భారీ పెరుగుదలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెర ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన బ్రెజిల్లో అననుకూల వాతావరణం వల్ల చెరకు పంట దెబ్బతినడం మొత్తం సూచీ పెరుగుదలకు ఒక కారణమని తెలిపింది. ఎఫ్ఏఓ ధరల సూచీ అక్టోబర్‌లో 205.8 పాయింట్లుగా ఉందని తెలిపింది. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ సూచీ 1.3 శాతం పెరిగిందని వెల్లడించింది. తృణధాన్యాలు, ఆయిల్‌సీడ్స్, డయిరీ ఉత్పత్తులు, మాంసం, చక్కెర నెలవారీ ధరల మార్పు ప్రాతిపదికన ఎఫ్ఏఓ ధరల సూచీ కూర్పు ఉంటుంది.