Global Hub
-
జీనోమ్ వ్యాలీలో జుబ్లియెంట్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: స్థానికంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో అంతర్జాతీయంగా పేరొందిన జుబ్లియెంట్ భార్తియా గ్రూప్ ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో జుబ్లియెంట్ భార్తియా వ్యవస్థాపకుడు, కో–చైర్మన్ హరి ఎస్. భార్తియా శనివారం భేటీ అయ్యారు. ఫార్మా, పరిశోధన, విలక్షణ ఔషధాలు, లైఫ్‌సైన్సెస్, వ్యవసాయ ఉత్పత్తులు సహా అనేక రంగాల్లో ఉన్న తమ గ్రూప్ ఆసియాలో హైదరాబాద్‌ను అత్యాధునిక వసతుల కేంద్రం ఏర్పాటుకు ఎంపిక చేసుకుందన్నారు. ఇప్పటికే లైఫ్‌సైన్సెస్ పరిశోధన రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు జుబ్లియెంట్ రాకతో క్లినికల్ రీసెర్చ్ సంస్థలకు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో సనోఫీ ‘గ్లోబల్ మెడికల్ హబ్’ అంతర్జాతీయంగా ఆరోగ్య సంరక్షణలో పేరొందిన ‘సనోఫీ’తెలంగాణలో గ్లోబల్ మెడికల్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సనోఫీ గ్రూప్ ఆఫ్ సైట్స్ హెడ్ మాథ్యూ చెరియన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా తాము గ్లోబల్ మెడికల్ హబ్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, సనోఫీ మధ్య కుదిరిన భాగస్వామ్యంతో ప్రపంచస్థాయి పెట్టుబడులు, భాగస్వామ్యాలు పెరుగుతాయని మాథ్యూ చెరియన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘2025– ఆ తర్వాత’అనే విజన్‌లో భాగంగా ఏర్పాటయ్యే గ్లోబల్ మెడికల్ హబ్‌లో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు
మైసూర్: ఈ దశాబ్దాన్ని భారతదేశ దశాబ్దంగా మార్చడం, దేశ పురోభివృద్ధే లక్ష్యంగా అన్ని రంగాల్లో అవసరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చడానికి, మన యువతలో పోటీతత్వాన్ని పెంచడానికి అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. సోమవారం మైసూర్ విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. గత 7 నెలలుగా సంస్కరణల్లో వేగం పెరగడాన్ని మీరు గమనించే ఉంటారని అన్నారు. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలు ఊపందుకున్నాయని, ఈ ప్రయత్నమంతా దేశ ప్రగతి కోసమేనని ఉద్ఘాటించారు. కోట్లాది మంది యువత ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యమని అన్నారు. మన పునాదులను పటిష్టంగా మార్చుకుంటేనే ఈ దశాబ్దం భారతదేశ దశాబ్దంగా మారుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుత దశాబ్దం దేశంలోని యువతకు అపారమైన అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లో అమలవుతున్న సంస్కరణలు గతంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏదో ఒక రంగానికే పరిమితం అయ్యేవని, ఇతర రంగాలను పక్కన పెట్టేవారని చెప్పారు. ఇండియాలో గత ఆరేళ్లుగా బహుళ రంగాల్లో బహుళ సంస్కరణలు అమలయ్యాయని వివరించారు. ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అధికంగా పెట్టుబడులు పెడుతూ నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే దేశాలే భవిష్యత్తును నిర్దేశిస్తాయని మోదీ వ్యాఖ్యానించారు. ఆయన సోమవారం గ్రాండ్ చాలెంజెస్ వార్షిక సమావేశంలో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. శాస్త్రీయ పరిశోధనా సంస్థలే భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని చెప్పారు. ఆరోగ్య రక్షణ విషయంలో ఇండియా ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. వైద్య రంగంలో భారత్ అనుభవం, పరిశోధనల్లో నైపుణ్యాలే ఇందుకు కారణమని వివరించారు. వైద్య రంగంలో ఇతర దేశాలకు సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం టీకాల్లో 60 శాతానికిపైగా టీకాలు భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ విధాన నిర్ణేతలు, పరిశోధకులను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చి పరిష్కార మార్గాలు కనిపెట్టడమే చాలెంజెస్ లక్ష్యం. -
16 బిలియన్ డాలర్లకు అనలిటిక్స్ పరిశ్రమ: నాస్కామ్
హైదరాబాద్: దేశీ అనలిటిక్స్ పరిశ్రమ 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో 600కు పైగా అనలిటిక్స్ సంస్థలు (వీటిలో 400 వరకు స్టార్టప్స్ ఉన్నాయి) ఉన్నాయని, దేశాన్ని అనలిటిక్స్ సొల్యూషన్స్‌కు సంబంధించి గ్లోబల్ హబ్‌గా మార్చే సత్తా వీటికి ఉందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఆయన ‘బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ సమిట్ 2016’ నాల్గవ ఎడిషన్ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా అనలిటి క్స్ సొల్యూషన్స్‌ను అందించే టాప్-10 దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2025 నాటికి ఇండియా టాప్-3లోకి చేరాలనేది తమ కోరికని తెలిపారు. అనలిటిక్స్ పరిశ్రమ వృద్ధితో దేశంలో ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం 90,000ల మంది అనలిటిక్స్ ప్రొఫెషనల్స్ హెచ్ఆర్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వృద్ధి అంచనాలను పరిశీలిస్తే.. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ హబ్‌గా అవతరించనుందని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ ఇంజినీర్ల కన్నా అధిక సంపాదన.. దేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కన్నా డేటా అనలిస్ట్‌లే ఎక్కువ సంపాదిస్తున్నారు. డిమాండ్-సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కోక్యూబ్స్ టెక్నాలజీస్ తన నివేదికలో తెలిపింది. ప్రారంభ స్థాయిలో సగటున డేటా అనలిస్ట్‌ల వార్షిక వేతనం రూ.7 లక్షలుగా ఉంటే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతం రూ.3.2 లక్షలుగా ఉందని పేర్కొంది.