Global Times Daily
-
సరిహద్దుల్లో చైనా సన్నద్ధత?.. నిజమెంత!
న్యూఢిల్లీ: లదాఖ్ ప్రతిష్టంభన చర్చల ద్వారా తొలగిపోతుందని భారత్ చెప్తున్న క్రమంలో.. చైనా కవ్వింపు చర్యలకు దిగింది. చైనా పీపుల్స్ లిబరేషర్ ఆర్మీకి చెందిన వేలాది పారా ట్రూపర్లు ఆ దేశ వాయువ్య సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కవాతు నిర్వహించినట్టు గ్లోబల్ టైమ్స్ మీడియా తన కథనంలో వెల్లడించింది. వాయువ్య సరిహద్దుల్లో చైనా భారీ స్థాయిలో సైనిక, రక్షణ సామాగ్రిని తరలిస్తోందని, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకే ట్రూపర్లతో డ్రిల్ జరిగిందని తెలిపింది. దానికి సంబంధించి వీడియోను సైతం విడుదల చేసింది. హుబెయి నుంచి ఆ ప్రాంతానికి కొద్దిగంటల్లోనే బలగాలు చేరుకున్నాయని, అవసరమైనప్పుడు వేగంగా బలగాలను చేరవేయగలమని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి చైనాతో నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన చర్చల ద్వారా పరిష్కారమవుతుందని భారత్ చెప్పిన మరునాడే ఈ వార్త వెలువడటం గమనార్హం. అయితే, భారత్‌ను మానసికంగా దెబ్బకొట్టేందుకే చైనా ఈ చర్యలకు పాల్పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: చైనాతో శాంతియుత పరిష్కారం) శత్రుదేశ బలగాల సన్నద్ధత, సామర్థ్యంపై అనుమానాలు రేకెత్తేలా చేయడం.. సరిహద్దు ఉద్రిక్తతల గురించి చిలువలు పలువలుగా అధికార మీడియాలో కథనాలు ప్రచురించడం ఎత్తుగడలో భాగమేననే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రపంచం దృష్టిని మరల్చేందుకు డ్రాగన్ ఇలాంటి చర్యలకు పూనుకుందని మరికొంత మంది వాదిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించే వీడియోలు, మ్యాపులు సోషల్ మీడియాలో విడుదల చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భారత్, చైనా సైనికాధికారుల మధ్య శనివారం చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా చైనా పక్షాన టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ హాజరయ్యారు. చర్చలకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ నెల రోజుల్లో రెండు దేశాల స్థానిక సైనిక కమాండర్ల స్థాయిలో 12 రౌండ్లు, మేజర్ జనరల్ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి సాధించలేదు. -
ఎవరెస్ట్.. అత్యంత ఎత్తయిన చెత్త కుప్ప
-
ఎవరెస్ట్.. ఎ ‘వరెస్ట్’...
ఏటికేడూ హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. వెరసి 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెత్త కుప్పగా మారిపోయింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎవరెస్ట్‌పై పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన ఓ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి ఎవరెస్ట్‌పై చెత్త పేరుపోతుండటం ఇప్పటిదేం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఒకానోక దశలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం పైకి ఎక్కేప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెవాలి. అప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది. కానీ ఏటా ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నది తేలింది. అవినీతి దందా... ‘ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అంత మొత్తం చెల్లించినప్పుడు తిరిగి చెత్తను వెంటపెట్టుకుని రావటం ఏంటన్న భావనతో చాలా మంది అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ డిపాజిట్ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర చెత్త పేరుకుపోయింది’ అని నేపాల్ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో 30 మంది సభ్యుల బృందం 8.5 టన్నుల చెత్తను అతికష్టం మీద తీసుకొచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా.. అవినీతి దందాతో లాభం లేకుండా పోతోందని పెంబా డోర్జే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎవరెస్ట్ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుందర హిహాలయాలను కలుషితం చేస్తోంది. ఎవరెస్ట్ పై పేరుకున్న వ్యర్థాలు మంచులో కలుస్తున్నాయి. మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతోంది. అది మహా ప్రమాదం’ అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
విదేశీ సంస్థలకు మరింత ఆకర్షణీయంగా భారత్..
♦ కానీ సంస్కరణల అమల్లో సవాళ్లు తప్పవు.. ♦ చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ కథనం బీజింగ్: భారత్ విదేశీ సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోందని చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ దినపత్రిక వ్యాఖ్యానించింది. అయితే, జీఎస్టీ తదితర సంస్కరణల అమలు అంత సులభతరం కాకపోవచ్చని ఒక వార్తాకథనంలో పేర్కొంది. ‘చౌక తయారీ కార్యకలాపాలు క్రమంగా చైనా నుంచి తరలిపోతున్న తరుణంలో ’ప్రపంచ ఫ్యాక్టరీ’గా చైనా స్థానాన్ని దక్కించుకోగలదా లేదా అన్నది భారత్‌కు, మిగతా ప్రపంచానికి చాలా కీలకంగా మారింది‘ అని గ్లోబల్ టైమ్స్ సదరు ఆర్టికల్‌లో పేర్కొంది. మౌలిక సదుపాయాల కొరత, రాష్ట్రాల స్థాయిలో పాలసీల అమల్లో సవాళ్లు మొదలైనవి ఉన్నప్పటికీ.. దేశ మార్కెట్‌ను ఏకం చేసే దిశగా భారత ప్రభుత్వం దూకుడుగా ప్రవేశపెడుతున్న సంస్కరణలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వివరించింది. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమలు దరిమిలా ఫాక్స్‌కాన్, మిడియా మొదలైన సంస్థలు ఇన్వెస్ట్ చేస్తుండటం దీనికి నిదర్శనమని పేర్కొంది. కొత్త పన్నుల విధానం.. మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఉందని, తయారీలో భారత్ పోటీతత్వాన్ని పెంచే విధంగా ఉందని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అయితే, లక్ష్యాన్ని సాధించడం భారత్‌కి అంత సులువు కాబోదని పేర్కొంది. 29 రాష్ట్రాల్లో నియంత్రణపరమైన, ప్రభుత్వ యంత్రాంగంపరమైన సవాళ్ల కారణంగా సంస్కరణ చర్యల అమలు అంత సులభతరంగా కాబోదని స్పష్టం చేసింది. ఇక కార్మిక శక్తి చౌకగా లభించినా.. మౌలిక సదుపాయాల కొరత, సంస్కృతిపరమైన వైరుధ్యాలు మొదలైనవి భారత్‌కి ప్రతికూలాంశాలని గ్లోబల్ టైమ్స్ తెలిపింది. -
ఆ పొట్ట.. కేశాల గుట్ట!
బీజింగ్: చిన్నపిల్లలు మట్టిని తినడం ద్వాపరయుగం నాటి నుంచి మనకు తెలిసిందే. ఇక ఈ కాలం పిల్లలు బలపాలు, చాక్‌పీసులు లాంటి వి తినడమూ.. తల్లిదండ్రులు వారిని మందలించడమూ కొత్తకాదు. అయితే, చైనాలోని 12 ఏళ్ల బాలిక మాత్రం అందరిలా మట్టి, బలపాలూ ఏం తింటామనుకుందో ఏమో, ఏకంగా జుట్టు తినడం మొదలెట్టింది. ఏకంగా అరకిలో బరువున్న వెంట్రుకలను చప్పరించేసింది!! స్థానిక ‘గ్లోబల్ టైమ్స్’ సోమవారం వెలువరించిన కథనం మేరకు.. చైనాలో హెనన్ ప్రావిన్స్‌కు చెందిన బాలికలో గత కొంత కాలంగా ఎదుగుదల లోపించింది. దీంతో ఆమె తల్లి లోయాంగ్లో ఉన్న హేనాన్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యులను ఆశ్రయించారు. వారు సీటీ స్కాన్ చేయగా 30 సెంటీమీటర్ల పొడవున్న కేశాల గుట్ట బాలిక పొట్టలోని 70శాతం భాగాన్ని చుట్టుకుని ఉన్నట్టు గుర్తించారు. ఈ నెల 11న శస్త్రచికిత్స చేసి కేశాల గుట్టను వెలికి తీశారు. దీని మొత్తం బరువు సుమారు అరకిలో పైనే ఉందని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లి నోరెళ్లబెట్టింది. సదరు బాలిక ‘పికా’ అనే వ్యాధితో బాధపడుతోందని, ఈ వ్యాధిబారిన పడ్డవారు మట్టి, చాక్‌పీసులు తదితర పదార్థాలు తినేందుకు అమితంగా ఇష్టపడతారని వైద్యులు వివరించారు. తమ కుమార్తె ప్రాణాలను కాపాడిన వైద్యులకు తల్లి కృతజ్ఞతలు చెప్పింది. -
ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభంపై చైనా పత్రిక ప్రశంస
బీజింగ్: సరిహద్దు అంశంపై భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా ఓ విషయంలో మాత్రం మన దేశాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తొలిసారి విమానవాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను తయారు చేసుకోవడాన్ని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రశంసించింది. ఈ చర్య ద్వారా దేశీయంగా అత్యాధునిక ఆయుధాల తయారీ దిశగా భారత్ ముందడుగు వేసినట్లయిందని పేర్కొంది. దేశీయంగా ఆయుధాల ఉత్పత్తిలో భారత ప్రభుత్వం ప్రాథమిక విజయం సాధించిందని ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రారంభం తెలియజేస్తోందని కొనియాడింది. దీనికితోడు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌ను భారత్ ప్రారంభించడం వచ్చే ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను మెరుగుపరిచే అవకాశం ఉందని పత్రిక అంచనా వేసింది.