ఆ పొట్ట.. కేశాల గుట్ట!
బీజింగ్: చిన్నపిల్లలు మట్టిని తినడం ద్వాపరయుగం నాటి నుంచి మనకు తెలిసిందే. ఇక ఈ కాలం పిల్లలు బలపాలు, చాక్‌పీసులు లాంటి వి తినడమూ.. తల్లిదండ్రులు వారిని మందలించడమూ కొత్తకాదు. అయితే, చైనాలోని 12 ఏళ్ల బాలిక మాత్రం అందరిలా మట్టి, బలపాలూ ఏం తింటామనుకుందో ఏమో, ఏకంగా జుట్టు తినడం మొదలెట్టింది. ఏకంగా అరకిలో బరువున్న వెంట్రుకలను చప్పరించేసింది!! స్థానిక ‘గ్లోబల్ టైమ్స్’ సోమవారం వెలువరించిన కథనం మేరకు.. చైనాలో హెనన్ ప్రావిన్స్‌కు చెందిన బాలికలో గత కొంత కాలంగా ఎదుగుదల లోపించింది.
దీంతో ఆమె తల్లి లోయాంగ్‌లో ఉన్న హేనాన్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యులను ఆశ్రయించారు. వారు సీటీ స్కాన్ చేయగా 30 సెంటీమీటర్ల పొడవున్న కేశాల గుట్ట బాలిక పొట్టలోని 70శాతం భాగాన్ని చుట్టుకుని ఉన్నట్టు గుర్తించారు. ఈ నెల 11న శస్త్రచికిత్స చేసి కేశాల గుట్టను వెలికి తీశారు. దీని మొత్తం బరువు సుమారు అరకిలో పైనే ఉందని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లి నోరెళ్లబెట్టింది. సదరు బాలిక ‘పికా’ అనే వ్యాధితో బాధపడుతోందని, ఈ వ్యాధిబారిన పడ్డవారు మట్టి, చాక్‌పీసులు తదితర పదార్థాలు తినేందుకు అమితంగా ఇష్టపడతారని వైద్యులు వివరించారు. తమ కుమార్తె ప్రాణాలను కాపాడిన వైద్యులకు తల్లి కృతజ్ఞతలు చెప్పింది.