Henan Province
-
'38 ఏళ్లొచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడి చిప్ దొబ్బింది..!'
బీజింగ్: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు. అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది. ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఈసారి షాక్.. అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది. తల్లి కోసమే.. కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే.. -
ఓరి దేవుడో! చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్, 35 కేసులు నమోదు
బీజింగ్: కరోనా వైరస్ ఇంకా అంతమవ్వనేలేదు. కోవిడ్ తీవ్రత తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో నిత్యం కేసులు నమోదవుతూనే ఉన్నాయి. భారత్‌లోనూ కోవిడ్ కేసులు వేలల్లో వెలుగు చూస్తున్నాయి. దీనికి తోడు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక కరోనాకు పుట్టినిల్లుగా భావించే చైనాలో మరో కొత్త రకం వైరస్ హడలెత్తిస్తోంది. అదే లాంగ్యా హెనిపా వైరస్‌గా వైద్యులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తూర్పు చైనాలోని హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లో ఇప్పటి వరకు 35 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. జర్వంతో బాధపడుతున్న రోగుల గొంతు నుంచి సేకరించిన నమూనాల్లో లాంగ్యా వైరస్‌ను వైద్యులు గుర్తించారు. ఈ వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ మనుషుల్లో మూడో వంతు మంది ప్రాణాలను తీయగలదని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులో ఎలాంటి మరణం సంభవించలేదు. అంతేగాక ఈ వైరస్ బారిన పడిన వారిలో కేవలం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. పేషెంట్లు ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. లాంగ్యా వైరస్‌కు ఇప్పటి వరకూ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దాని లక్షణాలు, సమస్యల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. చదవండి: కరోనా అంతమెప్పుడో చెప్పిన చైనా నోస్ట్రాడమస్.. ఇది నిజమేనా! -
18వ అంతస్తుపై సాహసం చేస్తూ..
ముంబై : సాహసం చేయడానికి ప్రయత్నించి ఓ యువకుడు 18 అంతస్తులపైనుంచి కిందపడి మృతిచెందాడు. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని క్విన్‌యాంగ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 19 ఏళ్ల యాంగ్ అనే యువకుడు 18 అంతస్తుల భవనం చివర చిన్నగోడపై నిలబడి సాహసం చేయడానికి ప్రయత్నించి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడు. ఆ సమయంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. గోడ రూఫ్ కూలిపోవడంతో యువకుడు ఒక్కసారిగా కిందకుపడిపోయాడు. రూఫ్‌టాప్ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సెల్ఫీ పిచ్చితోనో లేక సాహసాల పేరుతోనో ప్రాణాలు కోల్పోవొద్దని సందేశమిస్తూ ఏప్రిల్ 22న జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోను ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. దీంతో ఈవీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. డేరింగ్ సెల్ఫీ కోసం ప్రయత్నం చేస్తున్నారా? బాధ్యత లేకుండా సాహసాలు చేస్తున్నారా ? చేసేదేదైనా మీకు మిగిలేది రిస్క్ మాత్రమే అంటూ హెచ్చరించారు. సేఫ్టీ ఫస్ట్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ముంబైపోలీసులు ఈ పోస్ట్ పెట్టారు. -
సాహసం చేస్తూ 18 అంతస్తుల పైనుంచి పడి..
-
ఆమెని చూస్తే అవాక్కవుతారు!
'మెరిసేటి కన్నులు రెండు మేడిన్ చైనానా.. నీది ఆ దేశమైతే నేనే మావోనా..' లాంటి పక్తులు ఇంకా ఎన్నెన్నో పాడుకోవచ్చు చైనీస్ పడతి యే వెన్ మీద. ఆమెది.. 135కోట్ల జన చైనాలో 'మోస్ట్ స్టన్నింగ్ బ్యూటీ' అని నెటిజన్ల చేత కితాబుల కామెంట్లు పొందిందన అందం. పేరు యే వెన్. పుట్టింది 1966లో. అంటే ఇప్పుడామె వయసు 50 ఏళ్లన్నమాట! పెళ్లైన కొన్నేళ్లకే వెన్ ను భర్త విడిచిపెట్టాడు. అప్పటికే వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒంటరిగా పోరాడుతూ, చేతనైన పనులు చేస్తూ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేసింది. పిల్లలు సెటిల్ అయ్యాక సౌందర్యపోషణపై దృష్టిసారించింది. సహజంగానే మెరుపుతీగలా ఉండే వెన్.. బ్యూటీ కేర్ తో ఇంకా మెరిసిపోయింది. మొన్న మార్చిలోనే 50వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంది. ఆ సందర్భంగా ఆమె పెద్దకూతురు పట్టుపట్టి తల్లితో ఫోటో షూట్ చేసి, వాటిని ఇంటర్నెట్ లో పెట్టింది. అంతే! నెట్ లోకం దిగ్భ్రాంతికి గురైనట్లు స్థాణువైపోయింది. ఈమెకు 50 ఏళ్లా! అని ముక్కున వేలేసుకుంది. అన్నట్లు నిద్రపోయేటప్పుడు ఒంటిమీది దుస్తులన్నీ తీసేసి పడుకుంటుందట వెన్. అలా పడుకుంటే శరీరానికి నిగారింపువస్తుందని చైనాలో కొందరి నమ్మకం. (కింది ఫొటోల్లో ఒకదాంట్లో వెన్ తో కలిసున్న పాప ఆమె మనుమరాలు) -
ఆ పొట్ట.. కేశాల గుట్ట!
బీజింగ్: చిన్నపిల్లలు మట్టిని తినడం ద్వాపరయుగం నాటి నుంచి మనకు తెలిసిందే. ఇక ఈ కాలం పిల్లలు బలపాలు, చాక్‌పీసులు లాంటి వి తినడమూ.. తల్లిదండ్రులు వారిని మందలించడమూ కొత్తకాదు. అయితే, చైనాలోని 12 ఏళ్ల బాలిక మాత్రం అందరిలా మట్టి, బలపాలూ ఏం తింటామనుకుందో ఏమో, ఏకంగా జుట్టు తినడం మొదలెట్టింది. ఏకంగా అరకిలో బరువున్న వెంట్రుకలను చప్పరించేసింది!! స్థానిక ‘గ్లోబల్ టైమ్స్’ సోమవారం వెలువరించిన కథనం మేరకు.. చైనాలో హెనన్ ప్రావిన్స్‌కు చెందిన బాలికలో గత కొంత కాలంగా ఎదుగుదల లోపించింది. దీంతో ఆమె తల్లి లోయాంగ్లో ఉన్న హేనాన్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైద్యులను ఆశ్రయించారు. వారు సీటీ స్కాన్ చేయగా 30 సెంటీమీటర్ల పొడవున్న కేశాల గుట్ట బాలిక పొట్టలోని 70శాతం భాగాన్ని చుట్టుకుని ఉన్నట్టు గుర్తించారు. ఈ నెల 11న శస్త్రచికిత్స చేసి కేశాల గుట్టను వెలికి తీశారు. దీని మొత్తం బరువు సుమారు అరకిలో పైనే ఉందని వైద్యులు చెప్పడంతో బాలిక తల్లి నోరెళ్లబెట్టింది. సదరు బాలిక ‘పికా’ అనే వ్యాధితో బాధపడుతోందని, ఈ వ్యాధిబారిన పడ్డవారు మట్టి, చాక్‌పీసులు తదితర పదార్థాలు తినేందుకు అమితంగా ఇష్టపడతారని వైద్యులు వివరించారు. తమ కుమార్తె ప్రాణాలను కాపాడిన వైద్యులకు తల్లి కృతజ్ఞతలు చెప్పింది. -
సింహం భౌభౌ అనును..
బీజింగ్: అవును.. కుక్క కాదు.. సింహమే భౌభౌ అనును! కావాలంటే ఓసారి చైనా జూకు వెళ్లి చూడండి. అక్కడున్న ఆఫ్రికన్ ‘సింహం’ భౌభౌ అనే అంటుంది!! హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న లువోహ్లోని జూకు ఈ మధ్య లియూ అనే ఆయన వెళ్లాడు. తనతోపాటు తన కుమారుడిని కూడా తీసుకెళ్లాడు. వివిధ జంతువులు చేసే ధ్వనులను తన కుమారుడికి వినిపించాలన్నది ఆయన ఆరాటం. జూలో తిరుగుతూ తిరుగుతూ ఆఫ్రికన్ సిం హం అని రాసున్న బోను వద్దకు వీరు వెళ్లారు. ‘కన్నా.. ఇదిగోరా.. ఆఫ్రికన్ సింహం..’ అని లియూ గొప్పగా చెప్పాడు. ఆ పిల్లాడు నోరెళ్లబెట్టి అలా ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే ఆ సింహం భౌభౌ అని అరవడం ప్రారంభించింది. దీంతో ఆ పిల్లాడు నాన్న వైపు క్వశ్చన్‌మార్క్ మొహం పెట్టాడు. తీరా ఆరా తీస్తే.. అది సింహం కాదు.. గ్రామసింహమని తేలింది. కొంచెం సింహంలాగే కనిపించే టిబెటెన్ మాస్టిఫ్ జాతి కుక్కను జూవారు అక్కడ ఉంచారట. ఇది ప్రజలను మోసం చేయడమేనంటూ లియూ మండిపడుతూ మీడియాకెక్కాడు. అంతేకాదు.. చిరుత బోనులో నక్కను, తోడేళ్లదాన్లో కుక్కను, పాములుండే బోనులో వేరేవాటిని ఉంచారని చెప్పాడు. జూ అధికారులను విషయాన్ని ఆరా తీయగా.. తమ వద్ద నిజంగానే సింహముందని.. దాన్ని సంతానోత్పత్తి కోసం వేరేచోటికి తీసుకెళ్లామని.. అంతవరకూ తాత్కాలికంగా ఆ బోనులో ఓ జూ ఉద్యోగి తన గ్రామసింహాన్ని ఉంచాడని వివరణ ఇచ్చారు. మరోవైపు జూ అధికారుల తీరుపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.