సింహం భౌభౌ అనును..
బీజింగ్: అవును.. కుక్క కాదు.. సింహమే భౌభౌ అనును! కావాలంటే ఓసారి చైనా జూకు వెళ్లి చూడండి. అక్కడున్న ఆఫ్రికన్ ‘సింహం’ భౌభౌ అనే అంటుంది!! హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న లువోహ్‌లోని జూకు ఈ మధ్య లియూ అనే ఆయన వెళ్లాడు. తనతోపాటు తన కుమారుడిని కూడా తీసుకెళ్లాడు. వివిధ జంతువులు చేసే ధ్వనులను తన కుమారుడికి వినిపించాలన్నది ఆయన ఆరాటం. జూలో తిరుగుతూ తిరుగుతూ ఆఫ్రికన్ సిం హం అని రాసున్న బోను వద్దకు వీరు వెళ్లారు. ‘కన్నా.. ఇదిగోరా.. ఆఫ్రికన్ సింహం..’ అని లియూ గొప్పగా చెప్పాడు. ఆ పిల్లాడు నోరెళ్లబెట్టి అలా ఆశ్చర్యంగా చూస్తున్నంతలోనే ఆ సింహం భౌభౌ అని అరవడం ప్రారంభించింది.
దీంతో ఆ పిల్లాడు నాన్న వైపు క్వశ్చన్‌మార్క్ మొహం పెట్టాడు. తీరా ఆరా తీస్తే.. అది సింహం కాదు.. గ్రామసింహమని తేలింది. కొంచెం సింహంలాగే కనిపించే టిబెటెన్ మాస్టిఫ్ జాతి కుక్కను జూవారు అక్కడ ఉంచారట. ఇది ప్రజలను మోసం చేయడమేనంటూ లియూ మండిపడుతూ మీడియాకెక్కాడు. అంతేకాదు.. చిరుత బోనులో నక్కను, తోడేళ్లదాన్లో కుక్కను, పాములుండే బోనులో వేరేవాటిని ఉంచారని చెప్పాడు. జూ అధికారులను విషయాన్ని ఆరా తీయగా.. తమ వద్ద నిజంగానే సింహముందని.. దాన్ని సంతానోత్పత్తి కోసం వేరేచోటికి తీసుకెళ్లామని.. అంతవరకూ తాత్కాలికంగా ఆ బోనులో ఓ జూ ఉద్యోగి తన గ్రామసింహాన్ని ఉంచాడని వివరణ ఇచ్చారు. మరోవైపు జూ అధికారుల తీరుపై అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.