కర్తవ్యం, కార్యాచరణ మారాల్సిందే!
ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చే సంస్థ రెండు లక్ష్యాలను కచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. గ్లోబల్ ప్రపంచంలో భారత్ స్థానాన్ని పటిష్టపరచి, సుస్థిరం చేసేందుకు దోహదపడాలి. కాలానుగుణంగా పాలనలో, ప్రజా పంపిణీలో సరైన ఫలితాలను సాధించేలా కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని మెరుగపరచగలగాలి. ప్రధాని, కొందరు కేంద్ర మంత్రులు, సీఎంలతో కొత్త సంస్థ ఏర్పాటు అంటేనే సందేహాలు రేగుతున్నాయి. ఇది కొత్త సీసాలో పాతసారాయేనా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దీని వెనుక దేశహితం తప్ప రాజకీయ దృష్టి కోణం లేదని నిరూపించుకోవాలి.
ప్రణాళికా సంఘం కార్యాలయమున్న ‘యోజన భవన్’లో రెండు బ్లాక్‌ల మూత్రశాలల మరమ్మతుకు 35 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. కానీ, దారిద్య్రరేఖ దిగువనున్న వారిని ఖరారు చేయడానికి ప్రణాళికా సంఘం చెప్పిన లెక్కలే విచిత్రంగా కనిపించాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు 860 రూపాయలకు మించి, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 673 రూపాయలకు మించి వ్యయం చేసే కుటుంబాల వారు పేదలు కారట! ప్రణాళికా సంఘం కూడా సమాధానం చెప్పజాలని విమర్శ ఇది. మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విజన్ నుంచి పుట్టిన ప్రణాళికా సంఘం కాలక్రమంలో అసంబద్ధంగా తయారయిం దనడంలో వీసమెత్తు సందేహం లేదు. కానీ, నెహ్రూ ఆలోచనా విధానం, భావజాలం ఇంకా భారత్‌పై ప్రభావం చూపకూడదనే ఆరెస్సెస్ వంటి సంస్థల తలంపే ఈ సంఘానికి మంగళం పాడటానికి కారణమైతే మాత్రం అది ఆత్మహత్యా సదృశమే! ‘తలనొప్పి వస్తే మందేసుకుంటారు తప్ప తలే తీసేసుకోరు కదా!’ అనే వారూ ఉన్నారు.
ఆరున్నర దశాబ్దాల కాలంలో దేశంలో, ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులొచ్చాయి, ప్రణాళికా రచనలోనూ మార్పులు రావాల్సిందే. ప్రణాళికా సంఘాన్ని కొనసాగిస్తూ అవసరాల కనుగుణంగా మార్చుకోవచ్చని వారు సూచిస్తారు. నిజానికి ఇప్పుడు ప్రణాళికా సంఘాన్నే రద్దు చేయనుండటం పట్ల ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవరికీ పెద్ద ఆందోళన లేదు. దాని స్థానంలో ఏ ప్రత్యామ్నాయాన్ని తెస్తున్నారు? అన్నది వేయి రూకల ప్రశ్న! పెనం మీద కనలిపోతున్నపుడు ఏం చేసైనా దిగిపోవాలని ఉంటుంది, కానీ, పొయ్యిలోనే పడిపోతే? అలా జరగొద్దనేది అందరి ఆర్తి, ఆకాంక్ష. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నుంచి, దేశంలోని ఓ పెద్ద సంఘం రద్దు కాబోతోందన్న చర్చ అంతటా ఆసక్తిని రేపుతోంది. ఇటీవల ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని ‘టీమ్ ఇండియా’ను ఏర్పాటు చేస్తామని వెల్లడించడంతో అంతకుమించిన ఆసక్తి, ఆర్తి కొత్త సంస్థ స్వరూప స్వభావాలెలా ఉంటాయనే వైపు చర్చను దారి మళ్లించింది. ప్రణాళికా సంఘం రాజ్యాంగబద్ధ మైన సంస్థో, చట్టబద్ధమైన సంస్థో కాదు. కనుక కేంద్ర ప్రభుత్వపు ఒక తీర్మా నంతో వచ్చినట్టే, అది మరో తీర్మానంతో ఏకంగా రద్దయిపోతుంది, అదేమంత కష్టమైన పనికాదు. కాకపోతే, ఇప్పటివరకెదురైన ప్రణాళికా లోపాల్ని సరిది ద్దుతూ, ప్రస్తుత అవసరాల్ని నిర్వచిస్తూ భవిష్యత్తుకు ఉపయోగపడే బహుళ ప్రయోజనకరమైన కొత్త సంస్థను ఏర్పాటు చేయడం చాలా అవసరం. రాజ కీయ ఉద్దేశాలు, దురుద్దేశాలు లేకుండా అదెలా ఉంటుందన్నదే చాలా ముఖ్యం.
ఆర్థిక ప్రణాళిక మాత్రమే కాదు!
ఈ దేశంలో ఆర్థిక విధానాలకు వ్యూహాత్మకమైన మెరుగులు దిద్దే అవసరమ న్నది, స్వాతంత్య్రపు తొలి రోజుల నుంచి నేటి వరకూ నిరంతరంగా వస్తున్నదే. దేశ ఆర్థిక, సాంకేతిక, మానవ, ఇతరేతర వనరుల్ని అంచనా వేయడం, హేతు బద్ధంగా వినియోగించుకోవడం, అందుకవసరమైన ప్రాథమ్యాల నిర్ణయం, కేటాయింపులు, వివిధ దశలపై నిఘా-నియంత్రణ అన్నీ ప్రణాళికా సంఘం బాధ్యతలే! భవిష్యత్ అవసరాల్ని లెక్కించడం, తీర్చే ప్రణాళికలు రచించడం కూడా దాని బాధ్యత. సమాఖ్య రాజ్యమైన భారత్‌లో కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని ఇది చాలా ప్రభావితం చేస్తుంది. అందుకోసం ప్రత్యేకంగాఏర్పడ్డ ఈ సంఘం దేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తిని పెంచేదిగా ఉండాలని రాజకీయ పక్షాలు ఆశిస్తున్నాయి.
పరాయి పాలన నుంచి విముక్తి పొందిన పేద దేశంగా భారత్ నిలకడైన, వేగిరమైన ప్రగతి సాధించడానికి ప్రణాళిక అవసరాన్ని నాటి ప్రధాని పలు సందర్భాల్లో నొక్కి చెప్పారు. మొదట్లో నెహ్రూ ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో ప్రణాళికలపై ఆయన ఆలోచనలు తొంగి చూసేవి. దేశ పరిస్థితుల దృష్ట్యా ‘ఆహారోత్పత్తి పెంచండి’ అంటూ, 1942 ప్రాంతంలో అప్పటి మధ్యంతర ప్రభుత్వం విశేష ప్రచారం చేపట్టింది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానంగా బర్మా నుంచి బియ్యం రావని గ్రహించి, ఆ నినాద ప్రచారాన్ని మరో అయిదేళ్ల పాటు కొనసాగించాలనీ నిర్ణయించింది. సదరు విషయాన్ని నెహ్రూ ఒక లేఖలో ప్రస్తావించారు. బహుశా! ఇందులోంచి పుట్టిందేనేమో పంచవర్ష ప్రణాళిక ఆలోచన. సమాచార సేకరణ-వ్యాప్తి, వ్యూహం, ప్రణాళిక వంటివి యుద్ధంలో, పేదరిక నిర్మూలనలో ఎంతో సానుకూల ప్రభావం చూపుతాయని నెహ్రూ గట్టి విశ్వాసం. భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లోని అధికరణం 39 ప్రకారం, కేంద్ర ప్రభుత్వపు ఉత్తర్వుతో 1950 మార్చి 15న సంఘం ఏర్పడింది. మొదట్లో బాగుండింది. మంచి ఫలితాలొచ్చాయి.
సమాఖ్య స్ఫూర్తికి గ్రహణం
సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేయాల్సిన సంస్థ కాలక్రమంలో అందుకు పూర్తి విరుద్ధంగా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఓ ఉపకరణంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రాంతీయ రాజకీయ శక్తులు బలపడ్డ క్రమంలోనే, కేంద్రంలోని జాతీయపార్టీలకు అది నచ్చక, సంఘ దుర్వినియోగం పెరిగి సమాఖ్య స్ఫూర్తి చెడిందనే బలమైన అభిప్రాయం పెరగసాగింది. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు వేర్వేరు నైసర్గిక, భౌగోళిక, సామాజిక, రాజకీయార్థిక స్వరూపాల్లో ఉన్నపుడు కేంద్రం ఏకపక్షంగా రూపొందించే ప్రణాళికలు, ఆర్థిక విధానాలు ఎలా సరిపోతాయనే వాదన బలం పుంజుకుంది. ఏకరీతి విధానాల్ని నిర్వచించడం, అమలు చేయాలనుకోవడం సాధ్యపడేది కాదనే సత్యం పార్టీలకతీతంగా ఢిల్లీ అధికార పీఠంపై ఉన్నవారికీ తెలుసు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య, కేంద్రం-రాష్ట్రాల మధ్య, సరిహద్దు-సారూప్యత కలిగిన వివిధ రాష్ట్రాల మధ్య సయోధ్య కోసం కృషి చేయాల్సింది కూడా ప్రణాళికా సంఘం, దానికి అనుబంధంగా పనిచేసే వివిధ విభాగాలే! ఇంతే కాకుండా, దేశానికి ఏం కావాలి? అని నిర్ధారించి వ్యూహాత్మకంగా భవిష్యత్ దర్శనం చేసే మేధావివర్గాన్ని ప్రభుత్వంతో అనుసంధాన పరిచే బాధ్యత కూడా ఈ సంఘానిదే! జాతీయాభివృద్ధి మండలి (ఎన్డీసీ), అంతర్రాష్ట్ర మండలి (ఐఎస్సీ) ప్రణాళికా సంఘం నీడలోనే పనిచేస్తాయి తప్ప వాటితో పెద్దగా ప్రయోజనం ఉండదని రాష్ట్రాలు ఎప్పుడూ పెదవి విరుస్తుంటాయి.
వారి అనుభవాలు అలాంటివి. రాష్ట్రాల్లో బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారి వారి వార్షిక ప్రణాళికలు ఖరారయిన సందర్భాలెన్నో! అసలు ఈ ప్రణాళికలే ఓ పనికిమాలిన తంతు అనే విమర్శ కూడా ఉంది. రాష్ట్ర అవసరాలకు 180 డిగ్రీలు పూర్తి భిన్నంగా ఉన్నా, కేంద్ర పథకాల్ని అమలు చేస్తే తప్ప నిధులు రాని స్థితిని రాష్ట్రాలు ఈసడిస్తాయి. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్ని యధాతథంగానో, కొంచెం మార్చో రాష్ట్రాలు అమలు చేయాల్సిరావడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వాలు బలంగా అభిప్రాయపడతాయి. ‘భిక్షాపాత్ర పట్టుకొని యోజన భవన్లో నిలబడాలి, మా అవసరాల ప్రకారం కాదు, వారి విధానాల ప్రకారమే నిధులిస్తామంటారు, అలాగే ఖర్చు పెట్టాలంటారు. ఇదెలా మింగుడు పడుతుంది?’ అనే కొందరు రాష్ట్రాధినేతల ఆవేదనలో నిజముంది. రాష్ట్రాల్లో ఉండే వివిధ రాజకీయ ప్రత్యర్థి పక్షాల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని పాలకపక్షం వివక్ష చూపే సందర్భాలు కూడా కోకొల్లలు. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానే, కొత్త సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రధాని ప్రకటించగానే అత్యధిక ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేయడం వెనుక కారణమిదే.
ఇంతకీ ఏం కోరుకుంటున్నారు!
బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలన్న స్ఫూర్తే సమాఖ్య రాజ్యానికి అసలుసిసలు బలం. ప్రణాళికా సంఘం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండటం వరకు ఇబ్బంది లేదు. అది వారి రాజకీయ అవసరాలు తీర్చే ఉపకరణంగా మారటం రాష్ట్రాలకు గిట్టదు. రాష్ట్రాల సొంత అవసరాలకు తగిన రీతిలో విధానాలు, కార్యక్రమాల రూపకల్పన, ఆర్థికవనరుల వినియోగం ఉండాలని కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వం పేర్కొంటోంది. అదే భావనతో రాష్ట్రాలకు పూర్తిగా సహకరించే విధంగా, రద్దు కానున్న ప్రణాళికా సంఘం స్థానే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తే సర్వత్రా హర్షిస్తారు. దేశంలో 1991 ఆర్థిక సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చి దాదాపు పావు శతాబ్ది అవుతోంది. మార్కెట్ చోదక ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత ప్రణాళికా సంఘం సంబద్ధత, దాని విధానాల హేతుబద్ధత ఎంత అన్న ప్రశ్న తరచూ తలెత్తుతోంది. అందువల్ల, మారిన పరిస్థితుల్లో సరికొత్త అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని కొత్త సంస్థను రూపొందించాలి. ప్రభుత్వానికి ప్రయివేటు రంగానికి మధ్య మరింత సయోధ్య, ఉభయ ప్రయోజనకర కార్యాచరణ కావాలి. అంతర్జాతీయంగా, దౌత్యపరంగా కూడా పటిష్టమైన వ్యూహం, ఎత్తుగడలు అవసరం.
ఇప్పటికే ఇంధన వినియోగంలో నాలుగో అతి పెద్ద దేశంగా ఉన్న మన దేశ ఇంధన భద్రత శూన్యం. 2030 నాటికి ప్రపంచంలో 50 శాతం ఇందన వినియోగం చేసే విధంగా సాగుతున్న మన ఇంధన భద్రత విధానానికి, మన దౌత్యనీతికి పొంతనే లేదు. కొత్తగా వచ్చే సంస్థ కచ్చితంగా సాధించాల్సిన లక్ష్యాలు రెండుంటాయి. ఒకటి, గ్లోబల్ ప్రపంచంలో భారత్ స్థానాన్ని పటిష్టపరచి, సుస్థిరం చేసేందుకు దోహదపడాలి. రెండు, పాలన- ప్రజా పంపిణిలో సరైన ఫలితాలు సాధించేలా కేంద్ర-రాష్ట్ర సంబంధాల్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచేలా ఒక నిరంతర ప్రకియను ఈ సంస్థ కొనసాగించాలి. ప్రధాని నేతృత్వంలో, కొందరు కేంద్ర మంత్రులు, కొంత మంది ముఖ్యమంత్రులతో కొత్త సంస్థను ఏర్పరుస్తారనగానే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త సీసాలో పాతసారాయినే ముందుకు తెస్తారా? అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. కాదని, దీని వెనుక దేశహితం తప్ప పచ్చి రాజకీయ దృష్టి కోణం లేదని నిరూపించుకోవాలి.
ఈమెయిల్: dileepreddy@sakshi.com
- దిలీప్ రెడ్డి